'బీజేపీ' అసలు భయం: ముద్దుపెట్టుకుంటే 'శివసేన' మూతి కరుస్తుందేమో?

By Medi Samrat  Published on  11 Nov 2019 8:30 AM GMT
బీజేపీ అసలు భయం: ముద్దుపెట్టుకుంటే శివసేన మూతి కరుస్తుందేమో?

బట్టలు విప్పైనా, బట్టలు ఊడదీసైనా అధికారాన్ని పొందడమే రాజకీయం. సిద్ధాంతాలు, ఆదర్శాలు అధికార కాంక్షకు, నిజమైన రాజకీయ లక్ష్యాలకు వేసే అందమైన తొడుగులు మాత్రమే. మహారాష్ట్రలో ప్రస్తుతం జరుగుతున్నది ఈ రాజకీయ నిత్య సత్యానికి నిలువుటద్దం లాంటిది. బిజెపి, దాని నమ్మిన దోస్తు శివసేనలు ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాడుకుంటున్నాయి. సైద్ధాంతిక సారూప్యం, సామీప్యం ఉన్నా దేశ ఆర్ధిక రాజధాని ముంబాయిపై కబ్జా సాధించేందుకు ఈ రెండు పార్టీలూ ఒకరిని ఒకరు వదిలేసేందుకు సిద్ధమౌతున్నారు. ఈ రెండు హిందుత్వ పార్టీల మధ్య విశ్వాస లేమి ఏ స్థాయిలో ఉందో ఈ సంఘటన చెప్పక చెబుతోంది.

ముంబాయిలో బీజేపీ తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు వారాలుగా సంయమనాన్ని పాటిస్తోంది. ఇలాంటి పరిస్థితే కర్నాటకలో తలెత్తినప్పుడు నేతలు బెంగుళూరు ఢిల్లీల మద్య చక్కర్లు కొట్టారు. ప్రకటనల పేరిట నిప్పులు కుప్పించారు. చర్చల పరంపర కొనసాగించారు. కానీ మహారాష్ట్రలో బీజేపీ కాస్త లొంగినట్టు, కాస్త నెర్వస్ గా ఉన్నట్టు అనిపిస్తోంది.

మామూలుగానైతే విపక్షాలు బిజెపి వ్యూహ రచనా కౌశలానికి, రాజకీయ రణ సామర్థ్యానికి భయపడిపోయేవి. కానీ మహారాష్ట్రలో ఆదివారం బిజెపి నేతలు గవర్నర్ తో కలిసి మాట్లాడిన విధానం చాలా సాదాసీదాగా సాగింది. మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీరాలకు పోలేదు. కేవలం శివసేనతో తమకు ఇప్పటి వరకూ ఉన్న అవగాహన గురించి గవర్నర్ కు వివరించడం మాత్రమే చేశారు.

మరో వైపు శివసేన తన మాజీ మిత్రుడు బిజెపి “సర్జికల్ స్ట్రైక్” సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయలేదు. బిజెపి బేరసారాలకు దిగవచ్చునని, తన ఎమ్మెల్యేలను అంగడిలో కొనేసుకోవచ్చునని భయపడి, వారిని బాంద్రాలోని ఒక హోటల్ లోకి తరలించింది. వారితో పాటు ఎనిమిది మంది ఇండిపెండెంట్లను కూడా తరలించింది. బిజెపి అధికారం కోసం ఏ స్థాయికైనా వెళ్లవచ్చునని, తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగవచ్చునని అమిత్ షాకు అందనంత దూరానికి వారిని తీసుకెల్లింది. వారు కాలు బయటపెట్టొద్దని, తమకు చెప్పకుడా అడుగు వేయవద్దని ఆదేశించింది.

ఇదంతా ఎందుకు? శివసేన గొంతుక అయిన సామ్నా వ్రాసినట్టు బిజెపి తన డబ్బు సంచులను శివసేన ఎమ్మెల్యేలకు ఎర చూపవచ్చు. బిజెపి మిత్రపక్షం ఈ మాటను చెప్పడం ఇదే మొదటి సారి. అందునా హిందుత్వ విషయంలో బిజెపికి అత్యంత సమీపంలో ఉండే శివసేన ఈ మాట చెబుతోంది. కాబట్టి బిజెపి, మిగతా ఎన్డీయే మిత్రపక్షాల మధ్య మైత్రి కేవలం రాజకీయ అవకాశవాదం, అవసరాల పైనే ఆధారపడిందన్న మాట.

ఇరు పార్టీలూ హిందుత్వ సిద్ధాంతం ఆధారంగానే పనిచేసినా, ఒకే రకమైన కార్యపద్ధతిని అనుసరించి యువతను చేరదీసినా ఇద్దరి మధ్యా పరస్పర నమ్మకం లేదని అర్థమైపోతోంది. ఈ రెండింటి మధ్యా కాసింత తేడా ఉందన్నదీ అర్థమైపోతుంది. ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, శివ సేన, బిజెపిల మధ్య వీది రాజకీయాల విషయంలో శివసేన దే పైచేయి. ఈ విషయం బిజెపికి తెలుసు.అదే విధంగా మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రం కాదని, కర్నాటక తరహా ఆటను ఆడితే ఫరిణామాలు తీవ్రంగా ఉంటాయని బిజెపికి తెలుసు. అంతే కాదు. శివసేన జనతాదళ్ సెక్యులర్ వంటిది కాదు.

అలాంటప్పుడు బిజెపి శివసేన ప్రతిపాదించిన వంతులవారీ ముఖ్యమంత్రి విధానాన్ని ఎందుకు వ్యతిరేకించింది? దీనికి కారణం ఇరువురి మద్యా ఉన్న విశ్వాస రాహిత్యం. వంతుల వారీ ముఖ్యమంత్రుల విధానం విషయంలో బిజెపికి చాలా చేదు అనుభవాలున్నాయి. 1997 లో ఉత్తరప్రదేశ్ లో బిఎస్ పీ తో, 2004 లో కర్నాటకలో జనతా దళ్ సెక్యులర్ విషయంలో బిజెపి ఈ వంతులవారీ సీఎం పదవి విధానాన్ని అవలంబించింది. ఈ రెండు సందర్భాల్లోనూ బీఎస్ పీ, జనతా దళ్ లు తమ వంతు పదవీ కాలాన్ని అనుభవించి, బిజెపి వంతు రాగానే ప్లేట్లు ఫిరాయించాయి. కూటమి కుప్పకూలింది. సర్కారు శవమైపోయింది.అందుకే బిజెపికి మహారాష్ట్రలో ఈ విధానం విషయంలో సందేహాలున్నాయి. ఎందుకంటే చివరికి అధికార రాజకీయాలే ముఖ్యం. ఆదర్శాలు కాదు.

అందుకే తన సైద్ధాంతిక కవల అయిన శివసేనతో సైతం ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడానికి బిజెపి అంగీకరించడం లేదు. ఏమో... ముద్దు పెట్టుకుంటే శివసేన మూతి కరుస్తుందేమో? ఏమో .... రేపటికి మనసు మారి రెండున్నరేళ్ల తరువాత ముఖ్యమంత్రి పదవి పంచుకోవడానికి అంగీకరించకపోతే ?

-జింకా నాగ‌రాజు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్

Next Story