జీవన్ దాన్ - అవయవదాన ఉద్యమానికి ఆరేళ్లు..!
By అంజి Published on 10 Dec 2019 10:52 AM ISTహైదరాబాద్: ఆరేళ్ల క్రితం అవయవదానం గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పెద్దగా తెలియదు. బాగా అవసరమైతే, రోగి కుంటుంబ సభ్యులే కొన్ని అవయవాలను – ముఖ్యంగా లివర్, కిడ్నీ వంటివి – దానం చేసేవారు. మృతదేహాల నుంచి పనికొచ్చే అవయవాలను సేకరించి, భద్రపరచడం, అవసరమైన రోగులకు వాటిని అమర్చడం వంటివి పెద్దగా ఎవరికీ తెలియదు. అంతే కాదు. అవయవ దానం విషయంలో నియమ నిబంధనల్లో స్పష్టత ఉండేది కాదు. కొన్ని సంఘటనల్లో అసలు ఎలాంటి నిబంధనలూ ఉండేవి కావు. దీనితో కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు పండుగ చేసుకునేవి. కిడ్నీల అక్రమ అమ్మకాల వంటివి ఇష్టారాజ్యంగా సాగేవి.
అలాంటి సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో జీవన్ దాన్ కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 1, 2020 నాటికి ఇది ఆరేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ ఆరేళ్లలో అవయవదానమే జీవనదానమన్న విషయంలో అవగాహన పెరిగింది. ప్రజానీకం తమ ఆత్మీయులు చనిపోతే అవయవాలు దానం చేయడం వంటివి చేస్తున్నారు. అవసరమైన పేషెంట్లకు అవయవాలను ఇవ్వాలన్న విషయంలోనూ అవగాహన పెరిగింది.
జీవన్ దాన్ దావడంతో అవయవదానం విషయంలో నియమనిబంధనలను కూడా క్రమబద్ధీకరించడం జరిగింది. అవయవ వ్యాపాఉలు, మధ్య దళారులు, కిడ్నీ అమ్మకాల రాకెట్లను నిర్మూలించడం జరిగింది. పేద వర్గాలకు చెందిన అమాయకులను లక్ష్యంగా చేసుకుని వ్యాపారాలు చేయడం వంటివి తగ్గాయి.
“జీవన్ దాన్ మన రాష్ట్రంలో అవయవదాన ప్రక్రియను క్రమబద్ధీకరించింది. మృతదేహాల నుంచి అవయవాలు సేకరించే విషయంలోనూ నియమ నిబంధనలను క్రమబద్ధీకరించడం జరిగింది. జీవన్ దాన్ పరిధిలో ప్రైవేటు ఆస్పత్రులను కూడా తీసుకుని రావడం జరిగింది. అవయవాలు కావలసినవారి రిజిస్ట్రీ ని తయారు చేయడం కూడా జరిగింది,” అని తెలంగాణ జీవన్ దాన్ ఇన్ చార్జీ డా. జీ స్వర్ణలత తెలిపారు. జీవన్ దాన్ ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకూ 2766 అవయవాలను, 721 కణజాల సాంపిల్స్ ను మృత కళేబరాల నుంచి సేకరించారు. ఒకప్పుడు 4-5 చోట్ల మాత్రమే అవయవ సేకరణ జరిగేది. నేడు 38 చోట్ల అవయవాలను సేకరించడం జరుగుతోంది. మరి కొన్ని ఆస్పత్రులకు కూడా రిజిస్ట్రేషన్ లభించనుంది.
అయితే ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అవయవ సేకరణ చేయలేకపోతున్నాయి. గత కొన్నేళ్లను పరిశీలిస్తే 90 శాతం అవయవ సేకరణ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనే జరుగుతుంది. గుండె, కిడ్నీలు, కాలేయం వంటి అంగాల అవయవ మార్పిడి ప్రక్రియలోనూ ప్రైవేటు ఆస్పత్రులే ముందంజలో ఉన్నాయి. ఆందోళన కలిగించే మరో అంశమేమిటంటే గత మూడేళ్లలో తొలిసారి అవయవ దానం కొద్దిగా తగ్గిపోయింది. గత రెండేళ్లలో 150 నుంచి 160 అవయవదానాలు జరిగితే, ఈ ఏడాది ఆ సంఖ్య 124 కి పడిపోయింది. అవయవదానం పెరిగేలా చేయడం సవాల్లతో కూడుకున్న పని. అందుకే మేము వీలైనంత విరివిగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డా. స్వర్ణలత చెప్పారు.