గుండె జబ్బును కనిపెట్టే అలారం...

By అంజి  Published on  4 Dec 2019 11:30 AM GMT
గుండె జబ్బును కనిపెట్టే అలారం...

మీరు ఏదో పనిలో ఉండగా గుర్తుచేయాలంటే అలారం మోగుతుంది. అలాగే మీ గుండెకు కూడా మన హైదరాబాదీ శాస్త్రవేత్తలు ఒక అలారం ను కనిపెట్టారు. మీ గుండె పని తీరులో కాసింత మార్పు వచ్చినా ఈ అలారం మోగుతుంది. మీరు తక్షణం జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. హైదరాబాద్ ఐఐటీ శాస్త్రవేత్తలు గుండె జబ్బు ఉన్న వారి గుండె పనితీరులో మార్పులను కనిపెట్టే ఒక పరికరాన్ని కనుగొన్నారు. దీనికి చాలా తక్కువ విద్యుత్తు అవసరం. ఇది ఈసీజీ లోని మార్పుల ఆధారంగా తేడాలను గమనిస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేల ప్రకారం మిగతా వ్యాధుల కన్నా గుండె పోలటు వల్లేఎక్కువ మంది చనిపోతున్నారు. జీవన శైలిలో మార్పు, పొగాకు, మద్యం సేవనం, అనియమిత భోజనాలు, పళ్లు, ఆకుకూరలు తక్కువగా తినడం, శారీరిక వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి. ఈ వ్యాధులను గుర్తించేందుకు బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఒక సైబర్ భౌతిక వ్యవస్థ ఆధారిత వ్యవస్థను ఐఐఎం హైదరాబాద్ శాస్త్రవేత్తలు వేమిశెట్టి నరేశ్, అమిత్ ఆచార్యలు తయారు చేశారు. నరేశ్ ఐఐటీ ఎలక్ట్రికల్ ఇంజీనీరింగ్ డిపార్ట్ మెంట్ లోని ఎంబెడ్డెడ్ సిస్టమ్స్, ఐసీ డిజైన్ లాబరేటరీలో పనిచేస్తున్నారు. ఆచార్య ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్టమెంట్ లో ప్రొఫెసర్.

గుండె జబ్బులు ఉన్న వారు, లేని వారిని ఎంచుకుని, వారికి ఈ పరికరాన్ని ఇచ్చి, దాని పని తీరును వారు పరిశీలించారు. దీని సాయంతో గుండెపని తీరులో వచ్చే మార్పులను ముందుగా గుర్తించడం సాధ్యమౌతుందని, తద్వారా వారికి సమయానికి చికిత్స పొందేందుకు వీలు కలుగుతుందని వారంటున్నారు. సో... గుండె అలారం మోగితే కాస్త జాగ్రత్తగా వినండి. అలారం ను నొక్కేసి మళ్లీ గుర్రు పెట్టినట్టు పట్టించుకోకుండా ఉండకండి....

Next Story