జేసీపై కేసు.. నిర్బంధం.. పుట్లూరులో తీవ్ర ఉద్రిక్తత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Jan 2020 6:39 PM IST
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు నిర్బంధించారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు జేసీని నిర్భందించారు. జేసీపై ఐపీసీ 153ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే.. జేసీ దివాకర్‌రెడ్డి ముందస్తు బెయిల్‌తో పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. కానీ 6 గంటలుగా జేసీని స్టేషన్‌లోనే ఉంచారు. ఉద్రిక్త వాతవరణం నేపథ్యంలో పీఎస్ ఆవరణ నుంచి వెళ్లిపోవాలంటూ మీడియాకు పోలీసులు హుకుం చేశారు. జేసీని పరామర్శించేందుకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
అయితే.. పార్థసారథిని పోలీసులు పోలీస్‌స్టేషన్‌లోకి అనుమతించలేదు. ప్రధాన ద్వారం వద్దే పార్థసారథిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో టీడీపీ నాయకులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.