జ‌య‌ల‌లిత నివాసం 'పోయస్ గార్డెన్'‌ను స్వాధీనం చేసుకున్న ప్ర‌భుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 May 2020 12:00 PM GMT
జ‌య‌ల‌లిత నివాసం పోయస్ గార్డెన్‌ను స్వాధీనం చేసుకున్న ప్ర‌భుత్వం

జ‌య‌ల‌లిత‌.. తమిళనాడు చరిత్ర పుట‌ల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయో పేరిది. సినీన‌టిగా జీవితం ప్రారంభించి అనంత‌రం రాజకీయంగా ఉన్న‌త స్థానాన్ని అధిరోహించి పురచ్చితలైవిగా త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌లో సుస్థిర‌మైన స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నారు. ఉద్దండుల‌ను ఎదుర్కొని నిలిచి ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి బాధ్య‌త‌లు చేప‌ట్టి.. రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించారు.

అంతేకాదు ఎన్నో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు శ్రీకారం చుట్టి జ‌య‌ల‌లిత‌ దేశ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారు. అయితే.. ఉక్కు మహిళగా పేరున్న‌ జయలలితకు చెన్నైలో తన నివాసం పోయస్ గార్డెన్ 'వేద నిలయం' బంగళా అంటే అమితమైన ఇష్టం. అక్కడి నుంచే ఆమె ముఖ్య‌మంత్రిగా చక్రం తిప్పారు. అక్క‌డినుండే రాష్ట్రంలోని పరిస్థితుల‌నూ చ‌క్క‌దిద్దేవారు.

అయితే.. జ‌య‌ల‌లిత మరణించిన త‌రువాత‌ ఆమె సన్నిహితురాలు శశికళ కొద్దికాలం ఆ బంగళాలో ఉన్నారు. శశిక‌ళ జైలులో ఉండ‌టంతో ప్రస్తుతం పోయస్ గార్డెన్ ఖాళీగా ఉంది. ఈ నేఫ‌థ్యంలో తమిళనాడు ప్రభుత్వం పోయస్ గార్డెన్ బంగళాను స్వాధీనం చేసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది.

ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సంతకం చేసి.. బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ఆమోద ముద్ర వేశారు. దీంతో, బంగ్లాలోని వస్తువులు క‌డా ప్రభుత్వానికి చెందనున్నాయి. ఈ బంగ్లాను జయలలిత స్మారక మ్యూజియంగా ప్రభుత్వం తీర్చిదిద్దబోతోంది. ఇందులో జ‌య‌ల‌లిత‌ ఫొటోలు, వస్తువులు, సమాచారం ఉంచ‌నున్నారు.

Next Story
Share it