ఉగ్ర ఘాతుకానికి 40 మంది సైనికులు బలి

By సుభాష్  Published on  14 Feb 2020 4:26 AM GMT
ఉగ్ర ఘాతుకానికి 40 మంది సైనికులు బలి

ముఖ్యాంశాలు

  • ఉగ్ర దాడికి 40 మంది సైనికులు బలైన రోజు

  • నెత్తుటి గాయానికి ఏడాది

ఫిబ్రవరి 14.. అదో చీకటి రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 14వ తేదీ సైనికుల్లోనే కాకుండా దేశ ప్రజల్లో కన్నీళ్లు తెప్పించే రోజు. కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహనాలపై పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మమ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌కు చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూకశ్మీర్‌ - శ్రీనగర్‌ జాతీయ రహదారిపై 2019 ఫిబ్రవరి 14వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. సైనికులు కశ్మీర్‌ నుంచి శ్రీనగర్‌ వెళ్తుండగా ఈ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ దాడికి కశ్మీరీ ఉగ్రవాది ఆదిల్‌ అహ్మద్‌ను వినియోగించారు. ఆత్మాహుతిదాడిలో పాల్గొన్న ఉగ్రవాది హతమయ్యాడు. వాహనాలపై దాడికి పాల్పడిన ఉగ్రమూకలపై దేశం మొత్తం తీవ్ర స్థాయిలో రగిలిపోయింది.

పక్కా ప్లాన్‌తో దాడి

ఉగ్రవాదులు పక్కా ప్లాన్‌ ప్రకారం దాడికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్‌ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది అదిల్‌ అహ్మద్‌దార్‌ తన వాహనాన్ని జాతీయ రహదారిపై కల్వర్టు పక్క నుంచి కాన్వాయ్‌కి ఎడమవైపు నుంచి ప్రవేశించాడు. అవంతీపొర నుంచి అతడు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాది అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సైనికులు వెళ్తున్న క్రమంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారును నడుపుకొంటూ వచ్చిన ఉగ్రవాది.. సీఆర్పీఎఫ్‌ వాహన శ్రేణిలోని ఐదో బస్సును బలంగా ఢీకొట్టాడు. సీఆర్పీఎఫ్‌ వాహనాలు నినాదాంగా వెళ్తున్నాయని ముందుగానే పసిగట్టిన ఉగ్రవాది 78 వాహనాల కాన్వాయ్‌లోని ఐదవ బస్సును లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రాంతంలో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారి పని మరింత సులభతరంగా మారింది.

Pulwama Terror Attack 1

భారత సైన్యం ఆపరేషన్‌లో 10 మంది ఉగ్రవాదులు హతం

ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై పాల్పడిన దాడి తర్వాత భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్‌లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ దాడి పాల్పడింది తామేనంటూ పాక్‌ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో భారత్‌ మరింత ప్రతీకారంతో రగిలిపోయింది. పాక్‌ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని మరో సర్జికల్‌ స్ట్రయిక్‌ను చేపట్టింది. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున భారత సరిహద్దులు దాటి పాక్‌ భూభాగంలోకి ప్రవేశించిన వాయుసేన విమానాలు.. బాలాకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టారు. ఈ వాయుసేన సర్జికల్‌ స్ట్రయిక్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతయ్యారు.

40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

కాగా, తీవ్ర ప్రతీకారం పెంచుకున్న భారత సైనికులు.. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే మొదటిసారి. 40 మంది సైనికులను పొట్టనపెట్టుకున్న పాక్‌ ఉగ్రవాదులపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. ఉగ్రవాదుల గుండెల్లో దడ పుట్టించేలా వ్యవహరించారు. సైనికులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉగ్రస్థావరాలపై తెగబడ్డారు. స్థావరాలన్నీ నేలమట్టం చేసేశారు. ఈ దాడిలో సరిహద్దులోని సైనిక స్థావరాలపై ఎఫ్‌ -16 యుద్ధ విమానాలతో పాక్‌ దాడికి ప్రయత్నాలు కొనసాగించింది. అందుకు భారత సైన్యం సమర్ధంగా తిప్పకొట్టింది.

Surgical Strike

Next Story