ఆ ప్లేయర్లను ఊరి తీయండి : జావెద్ మియాందాద్
By తోట వంశీ కుమార్
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లను కఠినంగా శిక్షించాలన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నిరూపితమైతే.. ఏ మాత్రం ఉపేక్షించకుండా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. అప్పుడు మాత్రమే ఇతరులు ఈ తప్పును చేయకుండా ఉంటారని తెలిపాడు.
పాక్ క్రికెటర్లు మ్యాచ్ ఫికింగ్స్‌కు పాల్పడుతుండడం అలవాటుగా మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని మియాందాద్ మండిపడ్డాడు. తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలని పీసీబీకి సూచించాడు. తాజాగా.. ఉమర్ అక్మల్‌ను అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డాడని తేల్చిన పీసీబీ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఫిక్సింగ్‌కు పాల్పడటం అనేది హత్య చేయడంతో సమానం అని వ్యాఖ్యానించిన ఈ మాజీ కెప్టెన్.. హత్య చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారో ఫిక్సింగ్‌కు పాల్పడితే.. అలాంటి శిక్షలనే విధించాలని సూచించాడు. ఫిక్సింగ్ పాల్పడిన ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులతో కూడా నిజాయితీగా ఉండలేరని జావెద్ అన్నాడు.