ఇంగ్లాండ్ క్రికెట‌ర్ల పెద్ద మ‌న‌సు.. భారీ మొత్తంలో విరాళం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2020 3:14 PM GMT
ఇంగ్లాండ్ క్రికెట‌ర్ల పెద్ద మ‌న‌సు.. భారీ మొత్తంలో విరాళం

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి పై పోరాటానికి ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు ముందుకు వ‌చ్చారు. త‌మ జీతాల నుంచి భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు(పురుషులు, మ‌హిళ‌లు) స్వ‌చ్చందంగా త‌మ జీతాల్లో (మూడు నెల‌లు) 20శాతం విరాళంగా ప్ర‌క‌టించారు. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఈ ప్రతిపాదన చేయగా.. ఆటగాళ్లు అందుకు అంగీకరించారు. అంత‌కుముందు ఈసీబీ.. ఆట‌గాళ్ల జీతాల్లో 20 శాతం కోత విధిస్తామ‌ని ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్స్ అసోసియేష‌న్ (పీసీఏ)కు స‌మాచార‌మిచ్చింది. ప్ర‌స్తుతమిది చ‌ర్చ‌ల ద‌శలో ఉండ‌గానే.. ఇంగ్లండ్ పురుష క్రికెట‌ర్లు విరాళమిచ్చారు. మ‌రోవైపు ఇంగ్లీష్ మ‌హిళా క్రికెట‌ర్లు త‌మ జీతంలో మూడు నెల‌ల‌పాటు జీతంలో కోత విధించాల‌ని ఈసీబీకి సూచించారు.

'ఛారిటబుల్‌ డొనేషన్‌కు సంబంధించిన వివరాలపై ఇంకో వారంలో నిర్ణయం తీసుకుంటాం. ఈ విరాళం మొత్తం ఇంగ్లాండ్ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల మూడు నెలల జీతంలో 20 శాతంతో సమానం. ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈసీబీతో చర్చలు కొనసాగిస్తాం. ఇక్కడ క్రికెట్‌ కార్యకలాపాలతో పాటు బయటి పరిస్థితులు మెరుగయ్యేందుకు అవసరమైన విధంగా సమష్టిగా సహకరిస్తాం' అని క్రికెటర్లు వెల్లడించారు.

మ‌రోవైపు క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి త‌మ వంతు సాయం చేస్తామ‌ని కొందరు క్రికెటర్లు బోర్డుకు తెలిపారు. ఇప్ప‌టికే ఇంగ్లాండ్ వికెట్‌కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ గ‌తేడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో తాను ధ‌రించిన జెర్సీని వేలానికి ఉంచాడు. ఇక మహిళా జట్టు సారథి హెథర్‌నైట్‌ జాతీయ ఆరోగ్య సర్వీస్‌తో కలిసి వాలంటీర్‌గా పనిచేస్తోంది.

Next Story