బుమ్రా నోబాల్ పై పాక్ పంచ్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన భార‌త అభిమానులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2020 2:57 PM GMT
బుమ్రా నోబాల్ పై పాక్ పంచ్.. దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చిన భార‌త అభిమానులు

క‌రోనా వైర‌స్‌(కొవిడ్-19) ప్ర‌పంచ‌దేశాల‌న్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి వేల సంఖ్య‌లో మృత్యువాత ప‌డ‌గా.. ల‌క్ష‌ల్లో క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే.. పాకిస్థాన్‌లో కూడా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ప్ర‌జ‌ల్లో క‌రోనా పై అవ‌గాహాన క‌ల్పించేందుకు ఓ ప్రాంచైజీ భార‌త పేస‌ర్ జ‌స్‌ప్రీత్‌బుమ్రా నోబాల్ త‌ప్పిదాన్ని తెర‌పైకి తెచ్చింది. దీనికి భార‌త అభిమానులు ఘాటుగానే రిప్లై ఇచ్చారు.

అస‌లేం జ‌రిగిందంటే.. శనివారం సాయంత్రానికి పాకిస్థాన్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,700 దాటింది. అయిన‌ప్ప‌టికి ప్ర‌జ‌లు ఇంట్లో ఉండ‌డం లేదు. ఆ దేశ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) టోర్నీలోని ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్ న‌డుంబిగించింది. ఆ ప్రయత్నంలో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా నోబాల్ త‌ప్పిదాన్ని తెరపైకి తెచ్చింది.

ఇంగ్లాండ్ వేదికగా 2017లో భారత్, పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్‌లో భార‌త పేస‌ర్ బుమ్రా ఓ నోబాల్ వేశాడు. ఆ నోబాల్ కార‌ణంగా ఔట్ నుంచి త‌ప్పించుకున్న ఫ‌కార్ జ‌మాన్ శ‌త‌కంతో పాకిస్థాన్ ను గెలిపించాడు. ఆ నోబాల్ ఫోటోను ట్విట్ట‌ర్ లో ఇస్లామాబాద్ టీమ్ ట్వీట్ చేసింది. లైన్ దాటి మూల్యాన్ని చెల్లించుకోవ‌ద్దంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది.ఇది చూసిన భార‌త అభిమానులు ఇస్లామ‌బాద్ యునైటెడ్ టీమ్‌కి అదే రీతిలో చుర‌క‌లేస్తున్నారు. బుమ్రా తప్పిదంతో భార‌త్ మ్యాచ్‌ మాత్రమే ఓడింది.. కానీ.. మీ మహ్మద్ అమీర్ విసిరిన నోబాల్‌ తప్పిదానికి జైలు శిక్ష పడిందంటూ మ్యాచ్ ఫిక్సింగ్‌ని గుర్తుచేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు.

2010లో ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడు. ఆ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కి పాల్పడిన అమీర్ ఉద్దేశపూర్వకంగానే నోబాల్ విసిరాడు. దీంతో అమీర్ జైలు శిక్ష‌ను అనుభ‌వించాల్సి వ‌చ్చింది.

Next Story
Share it