ఫిఫా అండర్​-17 ప్రపంచకప్ వాయిదా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 April 2020 12:54 PM GMT
ఫిఫా అండర్​-17 ప్రపంచకప్ వాయిదా

ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో భార‌త్ వేదిక‌గా జ‌ర‌గాల్సిన ఫిఫా అండ‌ర్‌-17 మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డింది. 16 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక‌ టోర్నమెంట్.. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి 21 వరకు కోల్​కతా, గువహటి, భువనేశ్వర్​, అహ్మదాబాద్​, నవీ ముంబై వేదికలుగా జరగాల్సింది. క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తుండ‌డంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిఫా శనివారం వెల్లడించింది.

కరోనా కారణంగా ఇప్పటికే జపాన్ లో జరగాల్సిన ఒలింపిక్స్-2020 కూడా ఏడాది పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా తొలిసారి ఈ ఏడాదే భార‌త్ అండ‌ర్‌-17 పుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ లో పాల్గొంటుంది.

కాగా.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పనామా వేదికగా జరిగే మహిళల అండర్-20 ప్రపంచకప్‌తో పాటు ఈ టోర్నమెంట్‌ను కూడా వాయిదా వేస్తున్నట్లు ఫిఫా-కాన్ఫెడరేషన్స్ వర్కింగ్ గ్రూప్ ప్రకటనని విడుదల చేసింది.

'ఇటువంటి క్లిష్ట సమయంలో అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యం. జూన్ 2020 నుంచి జరగాల్సిన అన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లు వాయిదా వేశాం. ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో పెట్టుకొని 2022లో జరగాల్సిన ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్ మ్యాచ్‌ల గురించి కూడా కాన్ఫెడరేషన్లతో చర్చలు జరుపుతాం' అని వర్కింగ్ గ్రూప్ స్పష్టం చేసింది.

కరోనా దృష్యా ఏటా భారత్ లో పండుగలా నిర్వహించబడే ఐపీఎల్ కూడా రద్దు అయిన విషయం తెలిసిందే.

Next Story