కృష్ణకిషోర్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

By అంజి  Published on  25 Feb 2020 7:20 AM GMT
కృష్ణకిషోర్‌ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..

ముఖ్యాంశాలు

  • ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌ రద్దు చేసిన క్యాట్‌
  • కేంద్ర సర్వీసులకు కృష్ణకిషోర్‌ వెళ్లేందుకు ట్రిబ్యునల్‌ అనుమతులు
  • కృష్ణకిషోర్‌పై కేసులను చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్‌

హైదరాబాద్‌: ఏపీ ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ సస్పెన్షన్‌ను క్యాట్‌ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌ నరసింహరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం.. కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌పై విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వ సస్పెన్షన్‌ను తోసిపుచ్చిన క్యాట్‌.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చింది.

అయితే కృష్ణ కిషోర్‌పై ఉన్న కేసులను చట్ట ప్రకారం కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా, ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణ కిషోర్‌ పని చేశారు. ఆ సమయంలో అతడు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత కృష్ణ కిషోర్‌పై సీఐడీ విచారణకు ఆదేశించింది.

దీంతో హైదరాబాద్‌లోని క్యాట్‌ను కృష్ణ కిషోర్‌ ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు ఎలాంటి పోస్టింగు, జీతం కూడా ఇవ్వలేదు. దీనిపై క్యాట్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత జీతం చెల్లించారు. టీడీపీ హయాంలో.. వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో జాస్తి కృష్ణకిషోర్‌.. తన బృందంతో కలిసి కొన్ని నివేదికలు సమర్పించారు. అయితే ఈ కారణంగానే జగన్‌ ఆయనపై కక్ష పెంచుకున్నారని ఆరోపణలు సైతం వినిపించాయి.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. కేంద్ర సర్వీసులకు వెళ్తానన్న జాస్తిని రిలీవ్‌ చేయలేదు. కాగా ఇప్పుడు సస్పెన్షన్‌ రద్దు చేసిన.. క్యాట్‌ కేంద్రసర్వీసులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. జాస్తి కృష్ణ కిషోర్‌.. కేంద్రసర్వీసులకు వెళ్లనున్నారు.

Next Story