'జనసేన'కు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?
By సుభాష్
► పార్టీకి దూరంగా ఉంటున్న మాజీ జేడీ
► జనసేనపై అసంతృప్తి
జనసేనలో అసంతృప్తి సెగలు మొదలవుతున్నాయి. గత ఏడాది ఎన్నికల ముందు జనసేనలో చేరిన కీలక నాయకుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒకరు. 2019లో జరిగిన ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో రూ.100 స్టాంపు కాగితంపై ఆయన హామీలను ప్రింట్ చేయించి నియోజకవర్గ ప్రజలకు అందించారు. నేను గెలిస్తే నిత్యం ప్రజల మధ్యలో ఉంటాను.. పేదలకు అండగా ఉంటూ, ప్రతిపక్షాలను ప్రశ్నిస్తానని స్టాంప్ కాగితంలో పేర్కొన్నారు. ఇన్ని చేసినా ప్రజలు లక్ష్మీనారాయణలో నాయకుడిని చూడలేకపోయారు. చివరకు ఓటమి పాలయ్యారు. జనసేనలో ఎవరు గెలిచినా.. గెలవకపోయినా.. లక్ష్మీనారాయణ మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడని అనుకున్నా.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
పార్టీకి దూరంగా..
ఇదిలా ఉంటే.. ఓటమిపాలైన తర్వాత లక్ష్మీనారాయణ పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. అడపాదడపా పార్టీలో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు, జనసేనకు మధ్య వైరం వచ్చిందని, త్వరలోనే బీజేపీలో చేరనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రస్తుతం జనసేనలో ఉంటున్న లక్ష్మీనారాయణ.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. రాజధానిలో పవన్ కల్యాణ్ పర్యటించిన సమయంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ, పవన్‌తో మాట్లాడటం గానీ, కలువడం గానీ జరగలేదు. మరి పార్టీలోనే ఉన్నా.. పవన్ వెంట ఎందుకు ఉండటం లేదని ఇటీవల ఓ మీడియా ప్రశ్నిస్తే.. నేను ఎన్నో ఆశయాలతో ఉద్యోగానికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చాను. ఆ ఆశయాలను ప్రజల కోణాన్ని జనసేన పట్టుకోలేకపోయిందని చెప్పుకొచ్చారు. పైపై విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏమి ఉండదని చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే ఉన్నానని చెప్పారు. ఇక బీజేపీతో పొత్తు విషయంపై కూడా సంప్రదించలేదన్న కారణంతోనే పవన్‌పై లక్ష్మీనారాయణ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద లక్ష్మీనారాయణ జనసేనలోనే కొనసాగుతారా..? లేక బీజేపీ వైపు అడుగులు వేస్తారా ..? అన్నది వేచి చూడాల్సిందే.