జన్‌ధన్‌ ఖాతాదారులకు షాక్‌..ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి..!

By సుభాష్  Published on  28 April 2020 8:33 PM IST
జన్‌ధన్‌ ఖాతాదారులకు షాక్‌..ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి..!

జన్‌ధన్‌ ఖాతాదారులకు షాకిచ్చింది తెలంగాణ గ్రామీణ బ్యాంకు. తెలంగాణలో దాదాపు మూడు లక్షల జన్‌ధన్‌ ఖాతాలకు పీఎంజీకేవై కింద జమ చేసిన నగదును వెనక్కి తీసుకుంది. ఈ నగదును అందుకున్నవారిలో అనర్హులను గుర్తించింది. దాదాపు రూ.16కోట్లకు పైగా నగదును వెనక్కి తీసుకున్నట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం తెలిపారు. 2014 ఆగస్ట్‌ 1 తర్వాత ప్రారంభించిన ఖాతాలనే అర్హులుగా తేలినట్లు ఆయన స్పష్టం చేశారు.

పొరపాటున నగదు జమ

కాగా, పొరపాటున జన్‌ధన్‌ ఖాతాల్లో నగదును జమ చేసినట్లు, ఆ తర్వాత జరిగిన పొరపాటును గుర్తించి నగదును వెనక్కి తీసుకోవడం జరిగిందని జీఎం తెలిపారు. కాగా, అనర్హుల్లో లక్షకుపైగా ఖాతాదారులు వేసిన నగదును తీసుకున్నారని, వారి నుంచి తీసుకున్న నగదును రాబట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.

కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా సామాన్య జనాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు జమ చేస్తామని మోదీ సర్కార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఈ ఏప్రిల్‌ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా జన్‌ధన్‌ ఖాతాదారుల అకౌంట్లో డబ్బులు జమ చేసింది.

ఈ క్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లో సుమారు 9 లక్షల మంది ఖాతాదారుల్లో రూ.500 చొప్పున జమ అయ్యాయి. వీరిలో 5,15,260 మంది మినహా మిగిలిన వారందరూ అనర్హులుగా తేల్చింది బ్యాంకు. దీంతో పొరపాటు జరిగిందని, నగదును వెనక్కి తీసుకుంది.

Next Story