భారత సైన్యం ఆపరేషన్.. నలుగురు ఉగ్రవాదులు హతం
By సుభాష్ Published on 4 April 2020 8:35 AM GMTముఖ్యాంశాలు
భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య కాల్పులు
నిర్బంధ ఆపరేషన్ చేపట్టిన సైన్యం
నలుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టిన సైన్యం
జమ్మూకశ్మీర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య చోటు చేసుకున్న కాల్పుల్లో నలుగురు ఉగ్రమూకలు హతమయ్యారు. కుల్గామ్ జిల్లా హర్ధమంగూరి బతాపొరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని చుట్టుముట్టాయి. ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన సైన్యం వారి కాల్పులను తిప్పి కొట్టాయి.
దీంతో భద్రతా దళాలు - ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులను కుల్గామ్‌లోని డీహెచ్ పొరాకు చెందిన ఫయాజ్, మహ్మద్, షాహిద్, ఆదిల్‌గా గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సైన్యం గుర్తించింది.
కాగా, బుధవారం రాత్రి కుల్గామ్ జిల్లా నందిమార్గ్‌లో సిరాజ్ హమ్మద్, గులాం హసన్ అనే ఇద్దరు యువకులు హతమయ్యారు. వీరి హత్యలో ఈ నలుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు జమ్మూకశ్మీర్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
గత ఏడాది ఆగస్టు 5న కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పుడుతున్నారు. దీంతో భద్రతా దళాలు కూడా అప్రమత్తంగా ఉంటూ వారి కాల్పులను తిప్పికొడుతూ వస్తున్నాయి.