ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ బిల్లుకు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌జ‌లపై సాయుధ బ‌ల‌గాల‌ను ప్ర‌యోగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల నుంచి మొద‌లై క్ర‌మంగా దేశ‌మంతా విస్త‌రిస్తున్న ప్ర‌జాందోళ‌న‌కు ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా వ‌ర్సిటీ విద్యార్థుల పోరాటం స్ఫూర్తిగా నిలిచింది. ప్ర‌జ‌ల్ని మ‌తాల వారిగా విభ‌జించ‌డంతో పాటు, అట్ట‌డుగు వ‌ర్గాల అస్థిత్వాన్నే ప్ర‌శ్నార్థ‌కంగా మార్చివేస్తున్న పౌర‌స‌త్వ బిల్లును తిర‌స్క‌రిస్తూ ల‌క్ష‌లాది మంది వీధుల్లోకి వ‌స్తున్నారు.

ఎన్‌ఆర్‌సీ, క్యాబ్‌ చట్టాలకు వ్య‌తిరేకంగా జామియా మిలియా విశ్వ‌విద్యాల‌యం విద్యార్థులు శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జి చేయ‌డంతో పాటు, యూనివ‌ర్సిటీ లైబ్ర‌రీలోకి చొర‌బ‌డి మ‌రీ టియ‌ర్ గ్యాస్‌ను ప్ర‌యోగించారు. విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు రీడింగ్ రూమ్స్‌, బాత్ రూమ్స్‌, లైబ్ర‌రీ హాల్లో దాక్కున్నా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. కిటికీలు, త‌లుపులు ప‌గ‌ల‌గొట్టి పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ప‌లువురు విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రికి చేర్చే అవ‌కాశం కూడా లేని స్థితిని క‌ల్పించారు. మ‌రోవైపు ప‌లు ప్రాంతాల్లో మెట్రోరైల్ సేవ‌ల్ని కూడా నిలిపివేశారు. స‌కాలంలో విద్యార్థులకు స‌హ‌రించేందుకు ఎవ‌రూ చేరుకోకుండా విశ్వ‌విద్యాల‌యాల ప‌రిస‌రాల‌తో పాటు, న‌గ‌రంలోని ప‌లు చోట్ల భారీగా పోలీసుల‌ను మోహ‌రించారు.

క‌శ్మీర్ త‌రువాత‌… ఈశాన్య రాష్ట్రాల్లో ఇంట‌ర్‌నెట్ సేవ‌లు నిలిపివేసి, ప్ర‌సార‌, ప్ర‌చార సాధనాల‌పై ఆంక్ష‌లు విధించి పెద్ద ఎత్తున అణ‌చివేత‌ను ప్ర‌యోగించిన కేంద్రం ఇప్ప‌డు దేశ రాజ‌ధానిపై విరుచుకుప‌డుతోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అటు అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విద్యార్థుల‌పై లాఠీలు జులిపించ‌డంతో పాటు, యూనివ‌ర్సిటీలోనికి చొరబ‌డి బాష్ప‌వాయు గోళాల‌ను ప్ర‌యోగించారు. దాదాపు 50 మందికిపైగా విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.