బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం

By సుభాష్  Published on  18 Dec 2019 7:28 PM IST
బాంబు పేలుళ్ల కేసులో నలుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం

2008 జైపూర్‌ వరుస పేలుళ్లపై న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ పేలుళ్లలో నలుగురిని దోషులుగా తేలుస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొకరిని నిర్ధోషిగా ప్రకటించింది. 2008, మే 13న జైపూర్‌లో ఇండియా ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థ వరుస బాంబుపేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో సుమారు 80 మందికిపైగా మృతి చెందగా, మరో 150 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హనుమాన్‌ ఆలయం ప్రాంతంలో మరో ఐదు బాంబులను నిర్వీర్యం చేశారు. పేలుళ్లు జరిగిన ప్రాంతంలో అనేక మంది హనుమాన్‌ భక్తులు, విదేశీ పర్యాటకులు వస్తుండటంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి గత సంవత్సరం ఫిబ్రవరిలో ఐఎం ఉగ్రవాది అరిజ్‌ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టుచేశారు.

2008లో హవా మహల్‌ వద్ద మొదటి పేలుడు సంభవించగా, ఐదు నిమిషాల వ్యవధిలోనే మరో ప్రాంతంలోపేడుడు చోటు చేసుకుంది. ఇలా సుమారు ఏడు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడ్డారు. ఈ కేసు 12 ఏళ్ల పాటు కొనసాగగా, జైపూర్‌ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ బాంబుదాడికి పాల్పడిన ఇద్దరిని 2008లో ఎన్‌కౌంటర్‌ చేయగా, ఇప్పుడు మరో నలుగురిని దోషులుగా తేల్చింది న్యాయస్థానం.

Next Story