ఈ ఖైదీలు చేసిన ఇడ్లీలు... సెన్సేషన్!!
By సత్య ప్రియ Published on 18 Oct 2019 11:56 AM GMTఅదో జైలు ప్రాగణం... ఖైదీలు ఉండాల్సిన చోటు. అందరూ ప్రశాంతంగా ఉండాల్సిన చోటు. సాధారణ జైలులా కాకుండా అక్కడి ఖైదీలు అందరికీ రూ.5 కే ప్లేట్ ఇడ్లీ… అంటే నాలుగు ఇడ్లీలు అందిస్తున్నారు. అది మహబూబ్ నగర్ జిల్లా జైలు ప్రాంగణం. ఇక్కడ ఖైదీలతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయించారు జైలు అధికారులు.
ఖైదీలు చేస్తున్న ఈ ఇడ్లీలకు గిరాకీ రోజు రోజుకు పెరగడం విశేషం. చౌకధరతో పాటు మంచి రుచి అందిస్తుండటంతో అక్కడ తినే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. మూడు రోజుల క్రితం దీన్ని ప్రారంభించారు.
తొలిరోజు 400 మంది టిఫిన్ చేయగా రోజు రోజుకు వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మూడో రోజు నాటికి ఏకంగా 1100 మంది టిఫిన్ తిన్నట్టు జైలు అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ సెంటర్ ద్వారా ప్రతి రోజూ రూ. 7 వేల నుంచి రూ. 9 వేల వరకు ఆదాయం రాగా రూ.3 వేల వరకు లాభం వస్తుందని చెబుతున్నారు.
దీని వల్ల ఖైదీలలో సత్ప్రవర్తనతో పాటు వారు బయటకు వెళ్లిన తర్వాత స్వతహాగా పని చేసుకొని జీవించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. ఏమైనా జైలు అధికారులు చేసిన పనికి పలువురి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ జైలు ఎదుట నిర్వహిస్తున్న ఈ హోటల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది.