సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు ప్రారంభం: సీఎం జగన్
By సుభాష్ Published on 29 July 2020 11:05 AM ISTఏపీ రాష్ట్రంలో కరోనా కొరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. వేలాది పాజిటివ్ కేసులు వస్తుండటంతో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు విద్యా సంస్థలు సైతం మూతపడిన విషయం తెలిసిందే. ఇక మూత పడిన పాఠశాలలు సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభం అవుతాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్..ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు పనులపై రెండు రోజులకోసారి జిల్లా కలెక్టర్లు సమీక్ష చేయాలని సూచించారు.
అదే విధంగా ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కరోనా సోకిన బాధితుడికి 30 నిమిషాల్లోగా బెడ్ కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా పేషెంట్ వస్తే రాష్ట్రంలోని 138 కోవిడ్ ఆస్పత్రుల్లో బెడ్ దొరకలేదన్న మాట రాకూడదని అన్నారు. ఇందుకు కలెక్టర్లు, జేసీలను తప్పనిసరిగా బాధ్యులను చేస్తానని హెచ్చరించారు. అలాగే ప్రజల్లో తీవ్ర భయాందోళనలు తగ్గించే దిశగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, కోవిడ్ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి..? అనే విషయం తెలియని వారుండకూడదని అన్నారు.