ఢిల్లీకి జగన్.. మొన్నటి అమిత్ షా ఫోన్ తోనే పయనమా.?
By న్యూస్‌మీటర్ తెలుగు
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గడచిన కొంతకాలంగా దేశంలోని ఏ ఒక్క సీఎం ఢిల్లీ వెళ్లిన దాఖలా లేదు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి ఇంకా తగ్గకున్నా.. తొలిసారిగా జగన్ ఢిల్లీకి పయనమయ్యారు. మంగళవారం ఉదయం గన్నవరంలో ఫ్లైట్ ఎక్కనున్న జగన్... డిల్లీలో ల్యాండ్ కాగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ భేటీ కానున్నట్లుగా సమాచారం. జగన్ ఢిల్లీ టూర్ మొత్తంలో అమిత్ షాతో ఆయన జరిపే భేటీనే కీలకం కానుంది.
ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడే జగన్ ఢిల్లీకి వెళ్లడం, అమిత్ షాతో భేటీ కానుండటంపై పలు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓ రెండు రోజుల క్రితం అమిత్ షా నేరుగా జగన్ కు ఫోన్ చేయడం, ఆ తర్వాత ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ కు వెళుతున్న నేపథ్యంలో... అమిత్ షా ఫోన్ చేసిన కారణంగానే జగన్ ఢిల్లీకి వెళుతున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ విశ్లేషణ నిజమే అనుకుంటే... జగన్ ఢిల్లీ టూర్ సంచలన నిర్ణయాలకు దారి తీస్తుందన్న వాదనలు లేకపోలేదు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పలు కీలక పరిణామాలపై చర్చించేందుకే జగన్ ను అమిత్ షా డిల్లీకి పిలిచినట్లుగా ఈ విశ్లేషణలు చెబుతున్నాయి. అదే జరిగితే.. జగన్ కు కేంద్రం నుంచి మొట్టికాయలు పడటమో? లేదంటే... కేంద్రం నుంచి జగన్ కు భారీ అండో దక్కడం ఖాయమేనని చెప్పాలి.
అయితే అసలు మొన్న జగన్ కు అమిత్ షా ఫోన్ చేసిన దానికీ, ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళుతున్న దానికి అస్సలు సంబంధమే లేదని ఇంకొందరు వాదిస్తున్నారు. అమిత్ షా ఫోన్ చేసింది కేవలం కరోనా మహమ్మారి వ్యాప్తి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను పొడిగించడమా? లేదంటే ఎత్తేయడమా? లేదంటే ఇంకేం చేయాలన్న విషయంపై అన్ని రాష్ట్రాల సీఎంల అభిప్రాయాలు తెలుసుకునే క్రమంలోనే జగన్ కు అమిత్ షా ఫోన్ చేశారన్నది ఈ వాదనల సారాంశం. ఇక జగన్ డిల్లీ టూర్ విషయానికి వస్తే.. రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలపై కేంద్రంతో చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళుతున్నారని, ఇందులో ప్రత్యేకించి ఏమీ లేదని, కేంద్ర కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న అమిత్ షాతో భేటీ కూడా అందులో భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.