ఇటలీలో చేయిదాటిపోయిన పరిస్థితి

By రాణి  Published on  21 March 2020 11:32 AM IST
ఇటలీలో చేయిదాటిపోయిన పరిస్థితి

ముఖ్యాంశాలు

  • శుక్రవారం ఒక్కరోజే 627 కరోనా మరణాలు
  • కొత్తగా 6000 మందికి కరోనా నిర్థారణ
  • మూడ్రోజుల్లో 1500 దాటిన మృతుల సంఖ్య

ప్రకృతి ప్రకోపానికి మారుపేరుగా, యముడికి ఏజెంట్ గా పనిచేస్తోంది కరోనా వైరస్. దీని బారిన పడినవారు కోలుకోవడం కష్టమేనని ఇటలీని చూస్తే అర్థమవుతోంది. వైరస్ కు కేంద్రబిందువైన చైనాలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ..అక్కడ వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు కూడా ఇటలీలో సంభవించినన్ని మరణాలు మాత్రం నమోదు కాలేదు. రోజుకు 100-200 మరణాలు తప్ప..ఒకేరోజు 500మందికి పైగా మరణించినట్లు చైనా రికార్డుల్లో లేదు. కానీ..చైనా వెలుపల దేశాల్లో మాత్రం రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా..ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే 627మంది కరోనా బాధితులు చనిపోయినట్లుగా అక్కడి ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. దీంతో ఇటలీ కరోనా మరణాల సంఖ్య4032కు పెరిగింది. గడిచిన మూడ్రోజుల్లో 1500 మందికి పైగా కరోనా బారిన పడి మరణించడం అక్కడి వారిలో ఆందోళన కలిగిస్తోంది. అలాగే కొత్తగా 6000 కేసులు నమోదవ్వడంతో బాధితుల సంఖ్య 47,021కు చేరింది.

Also Read : బాలీవుడ్ సింగర్ కు కరోనా..సెల్ఫ్ క్వారంటైన్ లో మాజీ ముఖ్యమంత్రి

ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం నాటికి 11వేల కరోనా మరణాలు నమోదైతే..4000కు పైగా అంటే 36.6 శాతం మరణాలు ఇటలీలో జరిగాయి. దీనిని బట్టి ఇటలీలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి..వచ్చినవారికి వచ్చినట్లే చికిత్స అందిస్తున్నారు. మరోపక్క ఆ దేశ ప్రజలెవ్వరూ బయటికి రావద్దని అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టినా కూడా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయమే. పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకూ ఇటలీలో దుకాణాలు, వ్యాపార సంస్థలేవీ తెరువకుండా కఠినమైన ఆంక్షలను విధించే యోచనలో ఉంది ఇటలీ ప్రభుత్వం.

ఇటలీ తర్వాత శుక్రవారం ఫ్రాన్స్ లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఫ్రాన్స్ లో 78 మంది మృత్యువాత పడగా..మృతుల సంఖ్య 450కు చేరింది. మరో 12,612మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. కాగా..కరోనా వైరస్ టెస్ట్ కిట్ల కొరత కారణంగా అందరికీ సరిగ్గా వైద్యపరీక్షలు చేయడం లేదంటూ బాధితులు వాపోతున్నారు.

Also Read : భారీగా పడిపోయిన బంగారం ధర

రష్యాలో కూడా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో..చైనాలోని వుహాన్ లో 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రి నిర్మించినట్లే ఇక్కడ కూడా ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 3200మంది సైనిక సిబ్బందిని రంగంలోకి దింపింది రష్యా. ఇప్పటి వరకూ 253 కరోనా కేసులు నమోదైనట్లు అధికారికంగా తెలిపినప్పటికీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న అనుమానాలున్నాయి.

ఒక్క రష్యాలోనే కాదు..యావత్ ప్రపంచంలోని కరోనా బాధిత దేశాలన్నీ అసలు నమోదైన బాధితుల సంఖ్య చెప్పకుండా..తప్పుగా లెక్కలు చూపిస్తున్నాయన్న ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. అంతెందుకు చైనాలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో సుమారు లక్ష వరకు ప్రజలు చనిపోయారని అక్కడి వెబ్ సైట్ ఒకటి వెల్లడించింది. అయితే అదంతా తప్పని చైనా కొట్టిపారేసింది. మొత్తం 81,008 కేసులు నమోదవ్వగా 3,255మంది మాత్రమే మృతి చెందినట్లు చైనా లెక్కలు చూపించింది. భారత్ లో కూడా ఇప్పటి వరకూ 258 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇంతకన్నా ఎక్కువ కేసులే నమోదై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కరోనా కేసులు ఎన్నినున్నాయో చెప్పకుండా ఎందుకు దాస్తున్నారన్న ప్రశ్నకి సరైన సమాధానం లేదు. వేలసంఖ్యలో కేసులు పెరుగుతున్నాయంటే ప్రజలు భయపడతారని దాస్తున్నారా ? లేక వైరస్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వాల వైఫల్యాలు బయటపడుతాయనా ?

Also Read : ప్రపంచంలో ఈ దుస్థితికి చైనానే కారణం..

డబ్ల్యూహెచ్ ఓ మాత్రం ఆ దేశాలు అధికారికంగా చూపిన లెక్కల ప్రకారమే కరోనా కేసులను చెప్తోంది. అయితే కరోనా వైరస్ కేవలం వృద్ధులు, పిల్లలకే సోకుతుందన్న నియమం ఏమీ లేదని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ నుంచి యువతకేమీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న యువత కూడా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని తెలిపింది.

Next Story