ప్రపంచంలో ఈ దుస్థితికి చైనానే కారణం..

By Newsmeter.Network  Published on  21 March 2020 4:37 AM GMT
ప్రపంచంలో ఈ దుస్థితికి చైనానే కారణం..

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంది. దాదాపు అన్ని దేశాల్లోనూ ఈ వైరస్‌ విజృంభిస్తుండటంతో అప్రమత్తమవుతున్నారు. చైనాలో వూహాన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ చైనాలో విస్తరించి.. ఇతర దేశాలను పాకింది. తాజాగా ఇటలీలో ఈ వైరస్‌ మరణ మృదంగాన్ని మోగిస్తుంది. ఇటలీలో ఈ వైరస్‌ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4వేలు దాటిందంటే ఈ కరోనా వైరస్‌ ఎంత డేంజర్‌నో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వైరస్‌ వ్యాప్తిపై అమెరికా, చైనాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విమర్శలు గుప్పించాడు. ట్రంప్‌ ఇటీవలే కరోనా వైరస్‌ను చైనా వైరస్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే.

Also Read :భారత్‌లో ఒక్కరోజే 60 కరోనా పాజిటివ్‌ కేసులు!

తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారికి కారణం చైనానే అన్నారు. ఈ వైరస్‌ను చైనా దాచిపెట్టడం వల్లనే ఇప్పుడు ప్రపంచానికి ఈ దుస్థితి పట్టిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చైనాలోని వూహాన్‌లో వెలుగుచూసినట్లు భావిస్తున్న కరోనా వైరస్‌ను ప్రారంభంలోనే కట్టడి చేస్తే అది ఆ ప్రాంతానికే పరిమితమయ్యేదని ట్రంప్‌ అభిప్రాయ పడ్డారు. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని, ఇదే నిజమని తాను కూడా బలంగా నమ్ముతున్నానని ట్రంప్‌ స్పష్టం చేశారు. వైరస్‌ గురించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో చైనా విఫలమైందని అన్నారు. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన చైనా దీనికి బాధ్యత వహించాలని ట్రంప్‌ డిమాండ్‌ చేశారు.

అయితే చైనాపై ప్రతిచర్యలు ఉంటాయా అన్న ప్రశ్నకు ట్రంప్‌ సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే అమెరికా జాతీయ భద్రతా మండలి కరానో వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమంటూ ట్వీటర్‌లో పేర్కొంది. కరోనా వైరస్‌ ప్రాథమిక నివేదికలను బహిర్గతం కాకుండా చైనా తొక్కిపెట్టిందని, దీంతో ఈ మహమ్మారి తీవ్రతను అరికట్టగలిగే అవకాశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు కోల్పోయారని ట్వీట్‌లో పేర్కొంది.

అమెరికా వాదనలకు చైనా పూర్తిగా ఖండిస్తుంది. కరోనా వైరస్‌ను అమెరికా సైన్యమే తీసుకొచ్చిందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గతవారం ఆరోపణలు గుప్పించారు. చైనాలో కంటే ప్రపంచంలోని మిగతా దేశాల్లో కరోనా వైరస్‌ మరణాలు ఎక్కువ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) ప్రకటించిన రోజే అమెరికా, చైనాల మధ్య విమర్శల దాడి మొదలైంది.

Next Story