రాకెట్లు కాదు.. వెంటిలేటర్లు, మాస్కుల తయారీలో ఇస్రో
By న్యూస్‌మీటర్ తెలుగు
కరోనా కరోనా కరోనా.. ఎక్కడ విన్నా ఇదే మాట. ఈ వైరస్ గాలిలో ప్రయాణించదు కానీ ప్రపంచం అంతా చుట్టేస్తోంది. ఈ వైరస్ నుంచి ఎవరి దేశాన్ని వారు కాపాడుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
భారత్ లాంటి దేశాలు లాక్‌డౌన్ చేపట్టాయి. కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరగకుండా చూడటం కోసం లాక్ డౌన్ నిర్ణయం దోహదం చేస్తే.. ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాల్లో కరోనా మూడవ దశకు చేరుకోవడంతో బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
మన దేశంలో భారత్ కరోనా ఉపద్రవం నుంచి తప్పించు కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు హుటాహుటిన వెంటిలేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను తెప్పించడంపై దృష్టి సారించాయి. కరోనా సోకిన వారిలో ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బండి పడుతుండటంతో.. ప్రభుత్వాలు భారీ సంఖ్యలో వెంటిలేటర్లకు ఆర్డర్ ఇచ్చాయి.
ఇప్పుడు తాజాగా కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం తన వంతు సాయం అందించడానికి ఇస్రో రంగంలోకి దిగింది. సులువుగా ఆపరేట్ చేసే వెంటిలేటర్ల డిజైనింగ్‌తోపాటు శానిటైజర్లు, మాస్కులు, ఆక్సిజన్ క్యానిస్టర్ల ఉత్పత్తి కోసం విక్రమ్ సారభాయ్ స్పేస్ సెంటర్‌లో రాకెట్ల తయారీ కార్యకలాపాలను ఇస్రో తాత్కాలికంగా పక్కన పెట్టింది. లాక్‌డౌన్ వేళ.. అత్యవసర పరిస్థితుల్లో, ప్రజల అవసరాలను తీర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఇస్రో స్పేస్ సెంటర్ డైరెక్టర్ సోమనాథ్ వెల్లడించారు.
ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ భారత, విదేశీ శాటిలైట్లను ప్రయోగించడం కోసం రాకెట్లకు రూపకల్పన చేస్తారు. ఇప్పుడు మాత్రం కరెంట్ లేనప్పుడు కూడా సులభంగా ఆపరేట్ చేసేలా వెంటిలేటర్లకు డిజైనింగ్ చేస్తున్నామని సోమనాథ్ మీడియాకు తెలిపారు. తాము గతంలో చేసిన పనికి ఇది భిన్నమైందన్నారు.
ఇప్పటి వరకూ ఇస్రో వెయ్యి లీటర్లకుపైగా శానిటైజర్లను రూపొందించిందని, మాస్కులను కూడా తయారు చేస్తోందన్నారు. వెంటిలేటర్ డిజైన్లను తాము రూపొందిస్తామని కానీ దాని తయారీ బాధ్యతను ఇతర పారిశ్రామిక సంస్థలే స్వీకరించాలని ఆయన కోరారు..కరోనా నేపథ్యంలో ఉద్యోగులను ఇళ్ల నుంచి పని చేయాలని ఆదేశించామని సోమనాథ్ తెలిపారు.