యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ.. సస్పెండ్‌ చేసిన డీజీపీ

By Newsmeter.Network  Published on  27 March 2020 4:19 AM GMT
యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ.. సస్పెండ్‌ చేసిన డీజీపీ

భారత్‌లో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడినవారి సంఖ్య 700లకు చేరువైంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. తెలంగాణలో 45 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. దీంతో గత ఐదు రోజులుగా ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. మరోవైపు ఏపీలోనూ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని పోలీసులు తిరిగి ఇండ్లకు పంపిస్తున్నారు. మాటవినని వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు పోలీస్‌ సిబ్బంది అతిగా ప్రవర్తిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనవసరంగా లాఠీలు ఝుళిపిస్తూ సోషల్‌ మీడియాలో అబాసుపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో ఓ ఎస్‌ఐ అతిగా ప్రవర్తించాడు. పద్దతిగా చెప్పాల్సింది పోయి లాఠీలతో కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు. పెవలి మండలం ఖండవల్లికి చెందిన యువకుడు దుబాయ్‌ వెళ్లి ఇంటికి వచ్చాడు. అయితే అతడు ఐసోలేషన్‌ వార్డుకు వెళ్లకుండా ఇంటికి చేరుకోవటంతో విషయం తెలుసుకున్న ఎస్‌ఐ అక్కడికి వెళ్లాడు. యువకుడితో పాటు కుటుంబ సభ్యుల్ని దారుణంగా లాఠీతో కొట్టాడు. కొట్టొద్దంటూ కుటుంబ సభ్యులు వేడుకున్నా వదల్లేదు. దీంతో యువకుడు, అతడి కుటుంబ సభ్యులు ఎస్‌ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిన ఎస్‌ఐ వారి మాట వినకుండా లాఠీతో చితకబాదాడు.



ఈ ఘటనను వీడియో తీసి పలువురు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో ఎస్‌ఐ తీరుపై నెటిజర్లు మండిపడుతున్నారు. దీంతో తక్షణమే స్పందించిన యూనిట్‌ ఆఫీసర్‌ సదరు ఎస్‌ఐను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే ఐసోలేషన్‌ సెంటర్‌కు పంపించాలి తప్ప.. దాడి చేయడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర చర్యలు ఉంటాయని డీజీపీ హెచ్చరించారు.

Next Story