'గగన్‌యాన్‌'కు సిద్ధమవుతున్న ఇస్రో

By అంజి  Published on  23 Dec 2019 11:03 AM GMT
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న ఇస్రో

భారతదేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో 2021లో చేపట్టే మానవ సహిత అంతరిక్ష యాత్ర సిద్థమవుతోంది. ఇందులో భాగంగా భారత్‌ నేవీకి చెందిన ఏడుగురు వైమానిక దళ పైలట్లకు రష్యా శిక్షణ ఇస్తోంది. అయితే ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే మానవులను అంతరిక్షంలోకి పంపాయి. మొట్టమొదటి సారిగా మానవ సహిత అంతరిక్ష విమానాన్ని సోవియట్ యూనియన్ (అప్పట్లో రష్యా, సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉండేది) 12 ఏప్రిల్ 1961న వోస్టోక్ ప్రాజెక్టులో భాగంగా కాస్మోనాట్‌ యూరి గగారిన్‌తో ప్రారంభించింది. ఇప్పుడు భారతదేశం చేపట్టబోయే ఈ ప్రయోగానికి రష్యా సహాయం అందిస్తోంది. తాజాగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రష్యా అంతరిక్ష సంస్థ చీఫ్‌ డిమిత్రి రోగోజిన్‌ను కలుసుకున్నారు. ఈ మిషన్‌ యొక్క ముఖ్యమైన అంశాలను వీరిద్దరు చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ 2018 డిసెంబర్‌ నెలలో గగన్‌యాన్‌ మిషన్‌ను ఆమోదించింది. ఈ ప్రయోగానికి కావాల్సిన సుమారు రూ.10,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇస్రో చీఫ్‌ కె.శివన్‌ చేసిన ప్రకటన ప్రకారం ఈ ప్రాజెక్టు ద్వారా ముగ్గురు భారత వ్యోమగాములను కనీసం వారంపాటు అంతరిక్షంలోకి పంపబోతున్నారు. గగన్‌యాన్‌ ప్రాజెక్టు భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో మొదటగా రెండు మానవ రహిత మిషన్లను అంతరిక్షంలోకి పంపించనుంది. మొదటిది డిసెంబర్‌ 2020, రెండవ ప్రయోగం జులై 2021లో చేపట్టనున్నారు. చివరగా డిసెంబర్‌ 2021లో మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రయోగం చేపట్టనున్నారు.

అయితే ఈ మిషన్‌కు ఇస్రో మూడు దశల హెవీ లిఫ్ట్‌ వాహనం జీఎస్‌ఎల్వీ ఎం కె-3 ఉపయోగించనుంది. ఈ ప్రాజెక్టు కోసం జాతీయ ఏజెన్సీ సంస్థ అయిన డీఆర్‌డీఓ ఇస్రోతో కలిసి పని చేస్తోంది. ఈ మిషన్‌ విజయవంతం అయితే అంతరిక్షంలో మానువుడిని పంపిన నాలుగో దేశంగా భారత్‌ నిలవబోతుంది.

Next Story