పలమనేరు వాసులు ఐఎస్‌ఐ ఏజెంట్లు కాదు..!
By Newsmeter.Network
చిత్తూరు: పలమనేరు వాసులు ఐఎస్‌ఐ ఏజెంట్లు ఎప్పటికీ కారని పలమనేరు లారీ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సెక్రటరీ జిలానీ అన్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి.. ఒక ఫోన్ కాల్ చేసుకొని ఇస్తాను అని అనడంతో ఫోన్ ఇవ్వడమే తమ పాపమైందన్నారు. మానవతా దృక్పథంతో అజ్ఞాత వ్యక్తికి ఫోన్ ఇవ్వడంతో.. అతడు పాకిస్తాన్‌లో ఎవరికో ఫోన్ చేయడం వల్ల మమ్మల్ని ఐఎస్‌ఐ ఏజెంట్లు అనుకోవడం జరిగిందని, అందుకే మమ్మల్ని అరెస్ట్ చేసి ప్రశ్నించారని జిలానీ తెలిపారు. ఫోన్ సిగ్నల్ ద్వారా తమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారని, పూర్తి స్థాయి విచారణ అనంతరం విడుదల కూడా చేశారని తెలిపారు. తమ లారీ డ్రైవర్ పొరపాటు చేశాడన్నారు. అతను చేసిన ఫోన్ కాల్ వల్ల తాము ఇబ్బందులకు గురయ్యామని జిలానీ చెప్పారు.
తనకు, టెర్రరిస్టులకు ఎలాంటి సంబంధం లేదని లారీ డ్రైవర్ సయ్యద్ తెలిపారు. పోలీసులు కూడా తనను పూర్తి స్థాయిలో విచారించారని, ఆ తర్వాత ఒక లెటర్ కూడా ఇచ్చారని చెప్పాడు. తన జీవితం ఇప్పటికే నాశనమైందన్నారు. లారీ డ్రైవర్ సయ్యద్‌కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పొట్ట కూటి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాని తెలిపారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ఇవ్వడం వల్ల ఇంతా జరుగుతుందని తాను అనుకోలేదని సయ్యద్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ఐఎస్‌ఐ ఏజెంట్‌కు పట్టుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఐఎస్‌ఐ ఏజెంట్ విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నాడన్న సమాచారంతో పోలీసులు చిలకపాలెం టోల్‌గేట్ వద్ద కాపు కాసి లారీలో వెళ్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీఏఏ విపరీతమైన చర్చ నడుస్తోంది. సీఏఏ లొసుగుతో శత్రుదేశాల నిఘా సంస్థల ఏజెంట్లు, మద్దతు దారులు భారత్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని 'రా' ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గతకొంత కాలంగా దక్షిణ భారతదేశంలో ఉగ్రవాదులు ప్రవేశించారన్న ఇంటిలిజెన్స్ సమాచారంతో ఎన్‌ఐఏ పెద్ద ఎత్తున సోదాలు తనిఖీలు చేపట్టింది. ఉగ్రదాడులు జరుగుతాయన్న నేపథ్యంలో ఇప్పటికే కశ్మీర్ సహా పలు నగరాల్లో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.