అమెరికాను ఎదుర్కొనే సత్తా ఇరాన్‌కు ఉందా..?

By సుభాష్  Published on  22 Jan 2020 9:59 AM GMT
అమెరికాను ఎదుర్కొనే సత్తా ఇరాన్‌కు ఉందా..?

ముఖ్యాంశాలు

  • అమెరికా సైన్యం ముందు ఇరాన్ సైన్యం తక్కువే

  • ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సైనిక బలం మొదటి స్థానంలో

  • ఇరాన్ సైనిక బలం 14వ స్థానంలో

ఇరాన్‌ దేశం అమెరికాపై రంకెలేస్తోంది. తన సైనిక జనరల్‌ సులేమానీ ఖాసీం హత్యలో అమెరికాను అంతం చేయాలని పగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పటికే అనేక హెచ్చరికలు చేసింది. సైనిక జనరల్‌ను హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పింది. అనుకున్నట్లుగానే అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు తెగబడింది. ఒక వైపు ఈ దాడిలో పెద్ద ఎత్తున అమెరికన్‌ సైనికులు హతమయ్యారని ఇరాన్‌ చెబుతుండగా, మరో వైపు తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అమెరికా చెప్పుకొచ్చింది. ఇంతటితో ఆగని ఇరాన్‌ ఆమెరికా అంతు చూస్తామంటూ అదే పనిగా హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ఇరాన్‌ - అమెరికాల మధ్య ఉన్న పగ ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత సంవత్సరం పర్షియన్‌ గల్ఫ్‌ లో ఆరు చమురు ట్యాంకర్లు ధ్వంసం కావడానికి బెహరాన్‌ ముఖ్యకారణమని వాషింగ్టన్‌ ఆరోపిస్తోంది. అదే విధంగా గత ఏడాది సెప్టెంబర్‌లో సౌదీ ఆరేబియాలోని ఆరామ్‌ కో చమురు కేంత్రంపై ఇరాన్‌ మద్దతున్న హౌతీ తిరుగుబాటు దారులు దాడి చేశారని అమెరికా ఆరోపణలు గుప్పించింది. ఈ విధంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇందుకు ఫలితమే ఇరాన్‌ సైనిక జనరల్‌ సులేమానీ ఖాసీం హత్య అని దౌత్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికాను ఎదుర్కొనే సత్తా ఇరాన్‌కు ఉందా..?

ఇప్పుడు ఇంత చెలరేగిపోతున్న ఇరాన్‌.. అమెరికాను ఎదుర్కొనే సత్తా ఉందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా సులేమానీని హతమార్చిందనే ఆవేశంతో ఇరాన్‌ క్షిపణుల దాడులు, చమురు రవాణా చేస్తున్న నౌకలపై దాడులు చేసినంత మాత్రాన అమెరికాను ఎదుర్కొనే సత్తా ఇరాన్‌కు ఉందా..? అని చర్చ జరుగుతోంది.

అమెరికా బలం ముందు ఇరాన్‌ నిలబడేనా..?

ఇక ప్రపంచ వ్యాప్తంగా అమెరికా సైనిక బలం మొదటి స్థానంలో ఉంది. ఇరాన్‌ మాత్రం 14వ స్థానంలో ఉంది. ఇరాన్‌ వద్ద 3 లక్షల, 98 వేల సైన్యం, 3 లక్షల 50 వేల గ్రౌండ్‌ ఫోర్స్‌, 18వేల మంది నౌకాదళం, 30 వేల మంది ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది, ఇక అత్యంత కీలకమైన 1 లక్షా 25వేల మంది రివల్యూషనరీ గార్డులున్నట్లు సమాచారం. అలాగే రిజర్వ్‌ సైనికులు మూడు లక్షల మంది, మిలటరీ వాలంటీర్లు ఆరు లక్షల మంది ఉన్నారు. అమెరికా చేతిలో హతమైన సులేమానీ ఖాసీం ఈ దళాలకు నాయకత్వం వహించేవారు. ఇక అమెరికా సైన్యం, ఆయుధాల ముందు ఇరాన్‌ బలగాలు పెద్దగా లేవనే చెప్పాలి. దీనికి ఇరాక్‌ - ఇరాన్‌ యుద్ధం కారణంగా ఆర్థికంగా, సైనికంగా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ యుద్ధం ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.

అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్‌కు దెబ్బ

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టయిన చమురు బిజినెస్‌. అమెరికా ఆంక్షల కారణంగా చమురు వ్యాపారం అతలాకుతలమై ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్‌తో చమురు బిజినెస్‌ చేయవద్దంటూ గత సంవత్సరం భారత్‌ సహా అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఇరాన్‌ ఆర్థికంగా చతికిలాపడిపోయింది

ఇరాన్‌కు మద్దతు లేదు

కాగా, అరబ్‌ ప్రపంచంలోనూ ఇరాన్‌ దేశంకు పెద్దగా మద్దతు లేదు. ఇక సౌదీ ఆరేబియాతో శతృత్వమే తప్ప, స్నేహబంధాలేమి లేవు. సిరియా, లెబనాన్‌, కువైట్‌ ఇరాన్‌లు తప్ప ఇరాన్‌కు మద్దతు ఇచ్చే దేశాలు పెద్దగా లేవు. సిరియా, ఇరాక్‌ ల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ పరిస్థితిలో ఏ విధంగా ఆలోచించినా నష్టపోయేది ఇరానే. ఇక అంతర్జాతీయంగా చైనా, రష్యా వంటి ఆగ్రదేశాలు మద్దతున్నప్పటికీ, ఇరాన్‌ కోసం అమెరికాతో నేరుగా ఎదుర్కొనే సాహసం చేయలేవు. ఏది ఏమైనా అమెరికా బలం ముందు ఇరాన్‌ బలం ఏ మాత్రం లేదనే విశ్లేషకుల వాదన.

Next Story