ఐపీఎల్ కు కొత్త స్పాన్సర్ ఎవరు? బరిలోకి ఆ ముగ్గురు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Aug 2020 11:31 AM ISTక్రికెట్ క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఐపీఎల్ టోర్నీకి సంబంధించి కీలకమైన నిర్ణయాలు వరుసగా వెల్లడవుతున్నాయి. ఈసారి టోర్నీని దుబాయ్ లో నిర్వహిస్తుండటమే కాదు.. అందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టైటిట్ స్పాన్సర్ ఎవరన్నది మరో ఆసక్తికర అంశంగా మారింది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించాల్సిన వివో తప్పుకోవటం.. దాని స్థానే మరికొందరు తాజాగా బరిలోకి రావటం జరిగింది.
గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం వివో సంస్థ టైటిల్ స్పాన్సర్ గా రూ.440 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా కారణంగా తాము అంత చెల్లించలేమని.. తాము కుదుర్చుకున్న ఒప్పందాన్ని సగానికి తగ్గించుకోవాలని కోరింది. ఇందుకు బీసీసీఐ ససేమిరా అంది. ఇలాంటి సమయంలోనే.. భారత్ - చైనాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో వివో తనకు తానే స్వచ్చందంగా టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి ఈ ఏడాదికి తప్పుకుంది.
దీంతో.. టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం మూడు బడా బ్రాండులు పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. రేసులో ముందున్నట్లుగా చెబుతున్న సంస్థ బైజూస్. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులకు పెరిగిన డిమాండ్ తో పాటు.. ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో తమ బ్రాండ్ ను ప్రచారం చేస్తున్న జైజూస్.. ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ చేజిక్కించుకుంటే తమకు ప్రయోజనంగా మారుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో.. బీసీసీఐ కూడా బైజూస్ కే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఆ సంస్థ అయితే.. భారీ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధమవుతుందని చెబుతున్నారు.
అయితే.. బైజూస్ కు చెక్ పెట్టే దిశగా జియో ముందుకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. టైటిల్ స్పాన్సర్ షిస్ విషయంలో జియో సీరియస్ అయితే.. దాన్ని సొంతం చేసుకోవటం అంత కష్టమైన పని కాదని చెప్పాలి. ఎందుకంటే.. ఐపీఎల్ లోని సగం జట్లకు అసోసియేట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది జియోనే. ఈ నేపథ్యంలో జియోకు టైటిల్ స్పాన్సర్ కావటం కష్టం కాదు. ఇదిలా ఉంటే.. ప్రఖ్యాత అమెజాన్ సైతం స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
భారత్ లో ఇప్పటికే పాగా వేసిన అమెజాన్ మరింతగా బలపడేందుకు ఇదే తగిన సమయంగా భావిస్తోంది. దేశీయంగా ప్రజాదరణ ఎక్కువగా ఉండే క్రీడలో తాను భాగస్వామ్యం కావటం ద్వారా దేశ ప్రజలకు మరింత దగ్గర కావొచ్చని చెబుతున్నారు. అయితే.. ఇదెంతవరకు కార్యరూపం దాలుస్తుందన్నది ప్రశ్న. ఈ మూడే కాకుండా మరో పేరు వినిపిస్తున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకునే అవకాశం లేదనే చెప్పాలి. ప్రఖ్యాత బెవరేజస్ కంపెనీ కోకాకోలా కూడా టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. కరోనా వేళలో.. ఇప్పటికే అమ్మకాలకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ సంస్థకు అవకాశాలు తక్కువనే చెబుతున్నారు. అంచనాలు ఇలా ఉంటే.. చివరకుఎవరు విజేతగా నిలుస్తారో కాలం మాత్రమే డిసైడ్ చేయగలదు.