క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. అక్టోబర్‌లో ఐపీఎల్..!
By తోట వంశీ కుమార్ Published on 19 May 2020 4:48 PM ISTకరోనా దెబ్బకి క్రీడారంగం కుదేలైంది. చాలా టోర్నీలు రద్దు కాగా.. మరి కొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన టోర్నీలలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒకటి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ తొలుత ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఆ తరువాత లాక్‌డౌన్ కొనసాగించడంతో నిరవధికంగా వాయిదా పడింది. అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా..? అనే అనుమానులు సగటు అభిమానుల్లోనే కాదు ఐపీఎల్ ప్రాంఛైజీల్లోనూ ఉన్నాయి. ఐపీఎల్ రద్దు అయితే.. దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా బీసీసీఐ నష్టపోనుందనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సడలింపులు పెరుగుతుండడంతో ఐపీఎల్ పై మళ్లీ ఆశలు చిగురించాయి. ప్రేక్షకులు లేకుండా క్రీడా సముదాయాలు, స్టేడియాలను తెరుచుకోవచ్చంటూ కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొనడంతో బీసీసీఐతో సహా ఐపీఎల్ ప్రాంఛైజీలు, ఆటగాళ్లలో ఒక్కసారిగా ఉత్సాహాం వచ్చినట్లయింది.
ప్రేక్షకులు లేని స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహించే దిశగా క్రికెట్ బోర్డులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్లు నిర్వహించడం మినహా మరో దారి కనిపించట్లేదు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత్‌లో వర్షాకాలం కావడంతో మ్యాచ్‌ల నిర్వహణకు అంతరాయం కలగవచ్చు. సుమారు రెండు నెలల పాటు ఐపీఎల్ సాగనుంది. అక్టోబర్- నవంబర్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అయితే.. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ చివరి వరకు విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్ ను నిర్వహించాలా వద్ద అని ఈ నెల 28న జరిగే సమావేశంలో ఐసీసీ నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ ప్రపంచకప్ వాయిదా పడితే.. ఐపీఎల్ కు లైన్ క్లీయర్ అయినట్లే. మార్చి నుంచి ఆటగాళ్లు ఎలాంటి మ్యాచులు ఆడలేదు. ప్రాక్టీస్ లేకుండా నేరుగా ప్రపంచకప్ ఆడటాన్ని పలువురు క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్‌లో ఐపీఎల్ ను నిర్వహించి డిసెంబర్‌లో ప్రపంచకప్‌ను నిర్వహిస్తే ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని ఆటగాళ్లతో పాటు పలువురు మాజీలు సూచిస్తున్నారు.
స్టేడియాలపై సడలింపులు ఫ్రాంచైజీల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఐపీఎల్ నిర్వహించే అవకాశముంటే కచ్చితంగా ఖాళీ స్టేడియాల్లోనే జరిగే అవకాశం ఉంది. ఇదేం కొత్తకాదు. దేశంలో చాలా మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. రంజీ ట్రోఫీ ఫైనల్ కూడా ఖాళీ స్టేడియంలోనే నిర్వహించారు. ఐపీఎల్-13ను నిర్వహించాలా? లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐ చేతుల్లోనే ఉంది. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తే ఆటగాళ్లు, ప్రాంఛైజీలు, బ్రాండ్స్‌కు మంచిదని పలు ప్రాంఛైజీ యజమానులు అభిప్రాయ పడుతున్నారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహిస్తే తమకేం అభ్యంతరం లేదని చెప్పిన సంగతి తెలిసిందే.