పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకోవడం లేదు: న్యూస్ మీటర్ తో నాగబాబు

టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 April 2024 6:30 AM GMT
Pawan Kalyan, Janasena, Kapu Voters, Nagababu

పవన్ కళ్యాణ్ ఏ పదవి కోరుకోవడం లేదు: న్యూస్ మీటర్ తో నాగబాబు 

టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 80,000 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న కారణంగానే ఆయన పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది. పలు నియోజకవర్గాల్లో కాపు ఓటర్లను క్యాష్ చేసుకుంటుందనే నమ్మకంతో జనసేన ఉంది.

పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జనసేనకు సంబంధించిన అనేక వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఉన్నారు. వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఆయన పిఠాపురంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు.

నాగబాబు న్యూస్‌మీటర్‌తో కీలక విషయాలను తెలియజేసారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ కార్యాచరణ గురించి కూడా చర్చించారు.

న్యూస్ మీటర్: పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు?

నాగబాబు: ఎన్నికలకు చాలా రోజుల ముందే పవన్ కళ్యాణ్ కు శ్రీపాద శ్రీ వల్లభ స్వామి నుంచి ఆయనకు ఓ పిలుపు వచ్చింది. అందుకే ఆయన తన నియోజకవర్గాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. 2019లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి వాటిలో ఏదో ఒక స్థానానికి కట్టుబడి ఉండాలనుకున్నారు. కానీ పిఠాపురం ఎంచుకున్నారు. ఇది చాలా చిన్న నియోజకవర్గం. (సీనియర్ వైఎస్సార్‌సీపీ నేత, కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగగీతపై పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు).

న్యూస్ మీటర్: కూటమిలో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషించారు?

నాగబాబు: ఆయన లేకుంటే ఈరోజు ఈ పొత్తు (టీడీపీ-జనసేన-బీజేపీ) ఉండేదే కాదు. మొదటి నుంచి బీజేపీతో తాము కలిసే నడుస్తూ ఉన్నాం. టీడీపీ- ఎన్డీయే గతంలో ఒకటిగా ఉన్నా.. వారిని ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన విశేష పాత్ర పోషించారు.

న్యూస్ మీటర్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర, స్థానం ఏమిటి?

నాగబాబు: పవన్ కళ్యాణ్ ఏ పదవి కానీ, మంత్రివర్గం కానీ తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. ప్రభుత్వానికి మద్దతుగా.. కావాల్సిన సలహాలను మాత్రమే ఇస్తూ ఉంటారు. ఓ స్థానం కావాలని అడగడు, కానీ పవన్ కళ్యాణ్ నిర్ణయాధికారులలో ఒకడు. ఆయన ఏపీలో బాల్ కేశవ్ ఠాక్రే అవుతారు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఆయన మంత్రిపదవితో సరిపెట్టుకోలేరు. ఏపీకి కాబోయే సీఎం కావాలన్న తపన ఆయనలో ఉంది. జ‌న‌సేన ఎమ్మెల్యేల‌కు కీలక ప‌ద‌వులు అడ‌గనున్నారు. 2029లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మేము బలంగా నమ్ముతున్నాం. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత వైఎస్సార్సీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. టీడీపీ, జనసేన అనే రెండు పార్టీలు మాత్రమే ఉంటాయి. ఏపీ విభజన తర్వాత దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

న్యూస్ మీటర్: జనసేనలో అంతర్గత విభేదాలు ఎందుకు?

నాగబాబు: జనసేన పార్టీ ఓటు బ్యాంకును సంపాదించుకుంది. ఏపీ అంతటా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ప్రతి కార్యకర్త నేరుగా పవన్ కళ్యాణ్ కి కనెక్ట్ అయినట్లు భావిస్తారు. మొదట్లో కొంతమంది నేతలకు సీట్ల పంపకం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఇప్పుడు అది సద్దుమణిగింది. సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.

న్యూస్ మీటర్: ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారని అనుకుంటూ ఉన్నారు? ప్రజలు కూటమికి ఎందుకు ఓట్లు వేస్తారు?

నాగబాబు: రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో వైఎస్సార్‌సీపీ హయాంలో అమరావతి 'ఘోస్ట్‌ సిటీ'గా మిగిలిపోయింది. రాజధాని నగరం లేకపోవడం వల్ల సంపద ఉత్పత్తి నిలిచిపోయింది.. అసంఘటిత రంగానికి చెందిన లక్షలాది మందిపై ప్రభావం చూపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చినా 2019లో ఆగిపోయిన అభివృద్ధి పుంజుకోవడానికి కనీసం మూడేళ్లు పట్టవచ్చు. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమికి దాదాపు 120, 16-17 లోక్‌సభ స్థానాలు దక్కుతాయని భావిస్తూ ఉన్నాం. మధ్యతరగతి (వ్యాపారులు), అభివృద్ధికి, పరిశ్రమలకు, ఉపాధికి దూరమైన వారు మాకు ఓటేస్తారని భావిస్తున్నాం.

Next Story