చైనాలో మరో డేంజర్ వైరస్.. అప్రమత్తంగా ఉండాల్సిందే.!
Zoonotic Virus Langya henipa found in China. ప్రపంచ దేశాలు ఇప్పటికే అటు కరోనా.. ఇటు మంకీపాక్స్ కేసులతో ఆందోళన చెందుతున్న వేళ.. చైనాలో ఓ కొత్త వైరస్ వెలుగులోకి
By అంజి Published on 10 Aug 2022 12:22 PM ISTప్రపంచ దేశాలు ఇప్పటికే అటు కరోనా.. ఇటు మంకీపాక్స్ కేసులతో ఆందోళన చెందుతున్న వేళ.. చైనాలో ఓ కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకింది. ఇటీవల షాంగ్‌డాండ్, హెనాన్ ప్రావిన్స్‌ల్లో కొందరికి ఈ హెనిపావైరస్ సోకినట్లు గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్న ఈ రోగుల నుంచి సేకరించిన నమునాల్లో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు చైనా మీడియా పేర్కొంది. దీంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది సరికొత్త రకం హెనిపావైరస్ అని పరిశోధకులు తెలిపారు.
ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, దగ్గు, నీరసం, కండరాల నొప్పులు, వికారంగా ఉండటం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ వైరస్‌ను బయోసేఫ్టీ లెవల్-4 వైరస్‌గా చైనా మీడియా పేర్కొంది. ఇది మనుషులు, జంతువల్లో తీవ్ర అనారోగ్యాన్ని కలగజేయడంతో పాటు, 40 నుంచి 70 శాతం మరణాలు ఉండొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ఆధారంగా చెప్పింది. ఈ వైరస్ వ్యాప్తి నివారణకు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. లక్షణాలను బట్టి బాధితులకు రిలీఫ్ కలిగించే కొన్ని చికిత్సలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
''వైరస్ ఇప్పటి వరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి క్లూ లేదు. దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తమంగా ఉండాలి. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్ సర్వేలో.. మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం వరకు వైరస్ పాజిటివ్ తేలింది. 27 శాతం ఎలుకల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించాం'' అని తైవాన్‌కు చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్ సియాంగ్ తెలిపారు.
హెనిపా వైరస్ వ్యాప్తిపై డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ వాంగ్ లిఫా మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న వైరస్‌లు మనుషులకు సోకితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో తెలిపేందుకు ఇదోక హెచ్చరిక వంటిదన్నారు.