చైనాలో వరదలు పోటెత్తాయి. దీంతో.. ఓ బొగ్గు గనిలోకి వరద నీరు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ 29 మంది మైనర్లు పనిచేస్తున్నారు. వారిలో 8 మంది సురక్షితంగా బయటపడగా.. మరో 21 మంది మైనర్లు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చైనా ప్రభుత్వ వార్త సంస్థ చైనా డైలీ వెల్లడించిన వివరాల మేరకు.. వాయువ్య చైనా ప్రాంతంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో చాంగ్జీ హుయ్ అటానమస్ ప్రిఫెక్చర్‌లోని హుతుబి కౌంటీలో ఉన్న బొగ్గుగనిలోకి భారీగా వరద నీరు పోటెత్తింది.
వరద నీరు బొగ్గు గనిలో పోటెత్తే సమయంలో ఆ గనిలో 29 మంది మైనర్లు పనిచేస్తున్నారు. వరద గనిలోని నీరు ప్రవేశించిందన్న సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 మంది మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరో 21 మంది మైనర్ల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. కాగా.. ఈ బొగ్గు గని 1200 మీటర్ల లోతులో ఉంటుందని.. అంత లోతులోకి వెళ్లి మైనర్లను వెతకడం రెస్య్కూ సిబ్బందికి కష్టతరంగా మారింది. శక్తి వంతమైన మోటర్ల బిగించి ఆ బొగ్గు గనిలోని నీటిని బయటకు పంపుతున్నారు. మొత్తం నీరు బయటకు పంపిస్తేనే.. గల్లంతైన వారి వివరాలు తెలిసే అవకాశం ఉంది.