అవును.. జిన్ పింగ్ రావట్లేదు
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని
By Medi Samrat Published on 4 Sept 2023 7:51 PM ISTసెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ హాజరుకావడం లేదని బీజింగ్ సోమవారం నాడు ధృవీకరించింది. ఆ దేశ ప్రధాని లీ కియాంగ్ వస్తారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దు వెంబడి కార్యకలాపాలపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేస్తూ, “రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆహ్వానం మేరకు, స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ లీ కియాంగ్ భారతదేశంలోని న్యూఢిల్లీలో 9-10 సెప్టెంబర్ తేదీన జరగనున్న 18వ జి20 సదస్సుకు హాజరవుతారు." అని తెలిపారు.
ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉంటారని చైనా అధికారులు సెప్టెంబర్ 2న భారత్ కు తెలియజేశారు. భారతదేశం తొలిసారిగా నిర్వహించే అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షుడు జి గైర్హాజరు కావడానికి కారణాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొనలేదు. జిన్ పింగ్ గైర్హాజరుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదివారం స్పందిస్తూ, చైనా అధ్యక్షుడు శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం తనను నిరాశపరిచిందని అన్నారు. సెప్టెంబర్ 7-10 మధ్య బిడెన్ భారత్‌లో పర్యటించనున్నారు. జిన్ పింగ్ హాజరు కావడంలేదన్న వార్త తనను నిరాశకు గురిచేసిందని బైడెన్ అన్నారు. తొందర్లోనే జిన్ పింగ్ ను కలుస్తానని అన్నారు. చైనా అధ్యక్షుడు సదస్సుకు రాకపోవడం నిరాశకు గురి చేసిందని.. అయినా ఆయన్ను నేను త్వరలోనే చూడబోతున్నానని అన్నారు.