'ఆ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాం'.. ట్రంప్ మరో సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అమెరికా వలస విధానాన్ని కఠినంగా పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు.
By - అంజి |
'ఆ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాం'.. ట్రంప్ మరో సంచలనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అమెరికా వలస విధానాన్ని కఠినంగా పునఃసమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. దేశీయ వ్యవస్థలను పునర్నిర్మించడానికి, అనధికార వలసలను తిప్పికొట్టడానికి, విదేశీ పౌరుల పరిశీలనను కఠినతరం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా 'థర్డ్ వరల్డ్ కంట్రీస్ (అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని)' అని ఆయన పిలిచిన దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకటించారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘన్ జాతీయుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులలో ఒకరు తీవ్ర గాయాలతో మరణించిన తరువాత అధ్యక్షుడి ప్రకటన వెలువడింది . ఈ సంఘటన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ సహా 19 దేశాల నుండి వలస వచ్చిన వారి శాశ్వత నివాస స్థితిని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది.
''అమెరికా వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి వీలుగా అన్ని మూడవ ప్రపంచ దేశాల నుండి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తాను. అమెరికా సిస్టమ్ పూర్తిగా కోలుకునేందుకు ఇది తప్పనిసరి. బైడెన్ హయాంలో వచ్చిన అందరు అక్రమ వలసదారులు, దేశానికి ఉపయోగపడని వారిని, నేరాలు చేసిన వారిని పంపేయాలి. నాన్ సిటిజన్స్‌కు సబ్సిడీలు, ఫెడరల్ బెనిఫిట్స్ రద్దు చేయాలి'' అని తెలిపారు. "దేశీయ ప్రశాంతతను దెబ్బతీసే వలసదారులను తొలగిస్తామని, పబ్లిక్ ఛార్జ్, భద్రతా ప్రమాదం లేదా పాశ్చాత్య నాగరికతకు అనుకూలంగా లేని ఏ విదేశీ జాతీయుడిని అయినా బహిష్కరిస్తానని" ఆయన అన్నారు.