ట్రంప్‌పై దాడికి య‌త్నించిన‌ ర్యాన్ రూత్ ఎవ‌రు.?

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆదివారం మరోసారి దాడికి ప్ర‌య‌త్నం జ‌రిగింది.

By Medi Samrat  Published on  16 Sept 2024 11:41 AM IST
ట్రంప్‌పై దాడికి య‌త్నించిన‌ ర్యాన్ రూత్ ఎవ‌రు.?

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆదివారం మరోసారి దాడికి ప్ర‌య‌త్నం జ‌రిగింది. అందులో ట్రంప్ తృటిలో తప్పించుకున్నారని అమెరికా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎఫ్‌బిఐ తెలిపింది. ట్రంప్ నివాసం.. మార్ లాగో గోల్ఫ్ కోర్స్ సమీపంలో జరిగిన కాల్పుల్లో అనుమానితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. నిందితుడిని 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రూత్‌గా గుర్తించారు. ఘటనా స్థలంలో అధునాతన ఏకే-47 రైఫిల్, స్కోప్, గోప్రో కెమెరాను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ట్రంప్ నివాసంపై కాల్పులు జర‌ప‌డంతో ప్రతీకారంగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా కాల్పులు జరిపారని ఎఫ్‌బిఐ తెలిపింది. దీంతో పొదల్లో దాక్కున్న ర్యాన్ రూత్ బయటకు వచ్చి నల్లటి కారులో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ రిక్ బ్రాడ్‌షా మాట్లాడుతూ.. ట్రంప్‌పై దాడి చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

మీడియా నివేదికల ప్రకారం.. ర్యాన్ రూత్ నార్త్ కరోలినాలోని గ్రీన్స్‌బోరో ప్రాంత నివాసి. వృత్తిరీత్యా మాజీ నిర్మాణ కార్మికుడు. రూత్‌కు అధికారిక సైనిక నేపథ్యం లేదు. కానీ సోషల్ మీడియాలో సాయుధ సైనిక సంఘర్షణలో పాల్గొనాలని ర్యాన్ రూత్ తన కోరికను వ్యక్తం చేసిన‌ట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత.. ఉక్రెయిన్ తరపున యుద్ధం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ కోసం పోరాడి చావడానికైనా సిద్ధమని రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు. తన సోషల్ మీడియా బయోలో రూత్.. పౌరులు పోరును మార్చాలి.. భవిష్యత్తులో జరిగే యుద్ధాలను నిరోధించాలి' అని రాశాడు. మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మద్దతివ్వడానికి మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ చిన్న చిన్న నిర్ణ‌యాలు తీసుకోవాలని తన వాట్సాప్ బయోలో రూత్ రాశారు. రూత్ 2002లో కూడా అరెస్ట్ కావడం గమనార్హం.

నివాసం చుట్టూ కాల్పుల ఘటనపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో.. భయపడవద్దు, నేను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరూ గాయపడలేదు. దేవునికి ధన్యవాదాలు అని తెలిపాడు. తన నివాసానికి సమీపంలో కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ క్షేమంగా ఉన్నారని ట్రంప్ ప్రచార ప్రతినిధి కూడా తెలిపారు. ట్రంప్‌పై ఇటీవలి కాలంలో ఇది రెండో ఘోరమైన దాడి కావడం గమనార్హం.

Next Story