'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO) ఇటీవల ఓ ఆందోళనకరమైన నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు, పురుషుల వంధ్యత్వ రేటును బహిర్గతం చేసింది. సంస్థ నివేదికలో.. ప్రపంచంలోని ప్రతి ఆరవ స్త్రీ లేదా ఆరవ పురుషుడు సంతానలేమి వ్యాధితో బాధపడుతున్నారని లేదా తల్లిదండ్రులు కాలేకపోతున్నారని పేర్కొంది. WHO తాజా డేటా ప్రకారం.. ప్రపంచ జనాభాలో 17.5 శాతం మంది వయోజన వంధ్యత్వంతో బాధపడుతున్నారు. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సంఖ్య 17.8 శాతంగా ఉండగా.. పేద దేశాల్లో ఈ సంఖ్య 16.5 శాతంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా 12.6 శాతం మంది కొంత కాలంగా వంధ్యత్వంతో బాధపడుతూ.. ఆ తర్వాత కోలుకుంటున్నారని నివేదికలో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక మహిళ గర్భనిరోధక మాత్రలు ఉపయోగించకుండా.. ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతే.. ఆమె వంధ్యత్వ వ్యాధి బాధితురాలిగా పరిగణించబడుతుంది.
WHO విడుదల చేసిన నివేదికలో సమర్పించిన డేటా ప్రకారం.. 1990 నుండి 2021 వరకు మొత్తం 133 అధ్యయనాలను చదివిన తర్వాత ఈ నివేదిక తయారు చేయబడింది. ఇందులో 66 అధ్యయనాలు భార్యాభర్తలపై చేయగా, 53 అధ్యయనాలు ఇంకా వివాహం చేసుకోని వారి భాగస్వామితో లివ్ ఇన్‌లో నివసిస్తున్న వారిపై జరిగాయి. దీనితో పాటు వైవాహిక స్థితి గురించి చెప్పని 11 మందిని గూర్చి కూడా ఈ అధ్యయనంలో చేర్చారు.