పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ గగనతలంపై ఓ ఎగిరే వస్తువుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. త్రిభుజం లాంటి ఆకారంతో ఉన్న వస్తువు రెండు గంటలకు పైగా ఆకాశంలో ఉండిపోయిందనే ప్రచారం చేస్తున్నారు. 33 ఏళ్ల వ్యక్తి వివిధ కోణాల నుండి 12 నిమిషాల పాటు వీడియోను రికార్డ్ చేశాడు. అతడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు, అప్పటి నుండి అది వైరల్‌గా మారింది. "అది ఏమిటో నాకు ఇంకా తెలియదు. నేను దానిని 12 నిమిషాలకు పైగా వేర్వేరు సమయాల్లో చిత్రీకరించాను, డజన్ల కొద్దీ చిత్రాలను తీశాను. రెండు గంటల పాటూ గమనించాను" అని ఆ వ్యక్తి ది సన్‌తో చెప్పారు.
వీడియోలోని వస్తువు నలుపు రంగులో కనిపిస్తుంది. జూమ్ చేసినప్పుడు త్రిభుజాకార ఆకారంతో ఉంది. "కంటికి ఇది నల్లటి గుండ్రని రాయిలాగా అనిపించింది, కానీ నేను జూమ్ చేసి చూడగా, అది త్రిభుజం ఆకారంలో ఉండి వెనుకవైపు స్పష్టమైన ఉబ్బెత్తుతో ఉన్నట్లు నేను గమనించాను. వీటికి పదునైన అంచులు లేవు. చాలా కాంతిని ప్రతిబింబించడం లేదు. దాని నుండి ఎటువంటి లైట్లు కనిపించడం లేదు" అని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు.
కాన్‌స్పిరసీ థియరిస్ట్‌లు దీన్ని గ్రహాంతర వాహనం అని పిలిచారు. "తెలిసిన విశ్వంలో నక్షత్రాలు, గ్రహాల సంఖ్యలను బట్టి ఈ విశ్వంలో మనం మాత్రమే తెలివైన జీవులమనేది గణాంకపరంగా అసాధ్యం. మనకంటే మిలియన్లు లేదా బిలియన్ల సంవత్సరాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన నాగరికతలు ఉండాలి, ఆపై ఇతరులు కూడా ఉండాలి" అని వీడియో రికార్డు చేసిన అర్సాలాన్ చమత్కరించాడు. ఈ వీడియోకు సంబంధించిన ప్రామాణికత గురించి గ్లోబల్ స్పేస్ ఏజెన్సీలు, ఇతర సంస్థల నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు.