భారత్‌కు వెనేజులా చమురు - యుఎస్ గ్రీన్ సిగ్నల్.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

వెనేజులా చమురును భారత్ కు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

By -  అంజి
Published on : 10 Jan 2026 8:30 AM IST

USA, Venezuelan oil, India, Washington controlled framework, international news

భారత్‌కు వెనేజులా చమురు - యుఎస్ గ్రీన్ సిగ్నల్.. ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

వెనేజులా చమురును భారత్ కు ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అయితే ఇది అమెరికా నియంత్రణలో ఉన్న కొత్త ఫ్రేమ్‌వర్క్ కిందనే జరుగుతుందని ట్రంప్ పరిపాలనలోని సీనియర్ అధికారి వెల్లడించారు. అమెరికా విధించిన ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వెనేజులా–భారత్ చమురు వాణిజ్యం పాక్షికంగా పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌కు పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా వెనేజులా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను అనుమతిస్తారా? అనే ప్రశ్నకు అమెరికా అధికారి స్పష్టంగా “అవును” అని సమాధానమిచ్చారు. అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని తెలిపారు.

అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, వెనేజులా చమురును అమెరికా ప్రభుత్వం మార్కెట్ చేసి, ఆర్థిక లావాదేవీలను కూడా తమ నియంత్రణలోనే నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ విధానం కింద వెనేజులా చమురు అమెరికా ఆధ్వర్యంలోనే ఇతర దేశాలకు సరఫరా అవుతుందని చెప్పారు.

అమెరికా ఆంక్షలు అమల్లోకి రావడానికి ముందు వెనేజులా భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటి. ముఖ్యంగా భారీ క్రూడ్ ఆయిల్‌ను భారత రిఫైనరీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేవి. తాజా నిర్ణయంతో భారత్ తన ఇంధన దిగుమతులను విస్తరించుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశారు. వెనేజులా నుంచి 30 నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికానే శుద్ధి చేసి విక్రయించనుందని తెలిపారు. వెనేజులా చమురు రంగాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా చమురు కంపెనీలు కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న వెనేజులా, సంవత్సరాలపాటు ఆంక్షలు, దుర్వినియోగం, పెట్టుబడుల కొరత కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తాజా పరిణామాలతో వెనేజులా చమురు రంగంపై అమెరికా పూర్తి నియంత్రణ కొనసాగుతుందని స్పష్టమవుతోంది. అయితే, అమెరికా అనుమతిస్తే భారత్ వంటి కొన్ని దేశాలకు మాత్రమే పరిమితంగా చమురు సరఫరా జరగనుందని అధికారులు తెలిపారు.

Next Story