వలసదారులకు అమెరికా మరో షాక్..ఆ నిర్ణయంతో భారతీయులపైనా ఎఫెక్ట్
అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది.
By - Knakam Karthik |
వలసదారులకు అమెరికా మరో షాక్..ఆ నిర్ణయంతో భారతీయులపైనా ఎఫెక్ట్
అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD)ల ఆటోమేటిక్ పొడిగింపు విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 30, 2025 నుంచి అమల్లోకి వస్తుందని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల అమెరికాలోని ప్రవాస భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈరోజు లేదా ఆ తర్వాత ఈఏడీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఇకపై ఆటోమేటిక్ పొడిగింపు లభించదు. అయితే, ఈ తేదీకి ముందు దరఖాస్తు చేసుకున్న వారి పొడిగింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. గతంలో బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం, వలస ఉద్యోగులు తమ ఈఏడీ గడువు ముగిసినప్పటికీ, రెన్యువల్ కోసం సకాలంలో దరఖాస్తు చేసుకుంటే 540 రోజుల పాటు పనిచేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికారు.
జాతీయ భద్రత, ప్రజా రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగానే ఈ మార్పులు చేసినట్లు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. వలస ఉద్యోగుల నేపథ్యాన్ని తరచుగా సమీక్షించడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని, దేశ భద్రతకు హాని కలిగించే వారిని గుర్తించడం సులభమవుతుందని పేర్కొంది. ఈ కొత్త నిబంధనను "కామన్ సెన్స్" చర్యగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో అభివర్ణించారు. "అమెరికాలో పనిచేయడం అనేది ఒక హక్కు కాదు, అదొక ప్రివిలేజ్ (ప్రత్యేక అవకాశం)" అని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగ అనుమతిలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని యూఎస్‌సీఐఎస్ సూచించింది. దరఖాస్తు చేయడంలో ఎంత ఆలస్యం చేస్తే, అంతరాయం ఏర్పడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. సాధారణంగా అమెరికాలో నిర్దిష్ట కాలంపాటు పనిచేయడానికి అనుమతి ఉందని నిరూపించుకోవడానికి ఈఏడీ అవసరం. అయితే, పర్మినెంట్ రెసిడెంట్లు (గ్రీన్ కార్డ్ హోల్డర్లు), అలాగే హెచ్-1బీ, ఎల్-1బీ వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న వారికి ఈ డాక్యుమెంట్ నుంచి మినహాయింపు ఉంది.