అగ్రరాజ్యంలో కరోనా మరణమృదంగం.. 9 లక్షల మంది మృత్యువాత
US Death Toll From COVID-19 Hits 900000.అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఓ వైపు లక్షల్లో కేసులు
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2022 1:59 PM ISTఅగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఓ వైపు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా.. మరో వైపు మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కరోనా మమమ్మారి వ్యాప్తి మొదలైనప్పటికి నుంచి శుక్రవారం నాటికి ఈ మహమ్మారి కారణంగా అమెరికా వ్యాప్తంగా 9 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా మరే దేశంలోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు. అమెరికా తరువాత బ్రెజిల్, భారత్ లో అత్యధిక మరణాలు సంభవించాయి. బ్రెజిల్‌లో 6 లక్షల మంది మరణించగా.. భారత్‌తో 5లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఆ మధ్య అమెరికాలో కరోనా వ్యాప్తి తగ్గినట్లే కనిపించినా.. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విజృంభణతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. రోజుకు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రెండు నెలల వ్యవధిలోనే లక్ష మంది మరణించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అక్కడ రోజుకు 2400 మందికి పైగా మరణిస్తున్నారు. ఇక మరణాల సంఖ్య 9 లక్షలకు చేరడంపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరణాల సంఖ్యపై విచారణ వ్యక్తం చేశారు.
మహమ్మారి కారణంగా వల్ల కలిగిన మానసిక, శారీరక, భావోద్వేగా బాధలను భరించడం కష్టమన్నారు. 9 లక్షల మంది ప్రజలను కరోనా తీసుకుందన్నారు. ఎంతో మంది తమకు ఇష్టమైన వారిని కోల్పోయారని.. వారిని భాద వర్ణాతీతమన్నారు. ఈ మహమ్మారి ఎదుర్కోవడానికి వ్యాక్సిన్ ఒక్కటే అత్యుత్తమ ఆయుధంగా బైడెన్ అభివర్ణించారు. అమెరికన్లంతా వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ డోసులను కూడా తీసుకోవాలన్నారు. తద్వారా తమతో పాటు తమ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
అమెరికా అందరికంటే ముందుగానే వ్యాక్సిన్ల పంపిణీ మొదలుపెట్టింది. అయినప్పటికి అక్కడ కేవలం 64 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా తీసుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణంకాలు తెలుపుతున్నాయి.