ఇప్పుడు అమెరికా నోట 'బూస్టర్ డోస్'

US Approves Booster Dose Of Pfizer's Covid-19 Vaccine For Special Groups. అమెరికాను కరోనా మహమ్మారి ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. రోజూ కూడా వేలల్లో కరోనా కేసులు

By M.S.R  Published on  23 Sep 2021 12:02 PM GMT
ఇప్పుడు అమెరికా నోట బూస్టర్ డోస్

అమెరికాను కరోనా మహమ్మారి ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. రోజూ కూడా వేలల్లో కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. దీంతో అధికారులు బూస్టర్ డోసులను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 65 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ 19 ఫైజ‌ర్ బూస్ట‌ర్ టీకా వేసుకునేందుకు అమెరికా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. రిస్క్ ఎక్కువ‌గా ఉన్న వారితో పాటు ఎక్కువగా జ‌నం మ‌ధ్య తిరిగే ఉద్యోగాలు చేసేవారికి కూడా బూస్ట‌ర్ డోసు ఇవ్వ‌నున్నారు. ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యంతో ల‌క్ష‌లాది మంది అమెరిక‌న్లు మూడ‌వ డోసు వేసుకోనున్నారు. రెండ‌వ డోసు వేసుకున్న ఆర్నెళ్ల త‌ర్వాత మూడ‌వ డోసు కోవిడ్ టీకా తీసుకోవాల‌ని ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ తాత్కాలిక అధినేత జానెట్ వుడ్‌కాక్ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. వ్య‌క్తిగ‌త నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు జానెట్ వెల్ల‌డించారు. అయితే 16 ఏళ్లు దాటిన వారికి కూడా బూస్ట‌ర్ టీకా ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను నిపుణుల క‌మిటీ తోసిపుచ్చింది. బూస్ట‌ర్ డోసుల అంశంలో అంటువ్యాధుల సంస్థ (సీడీసీ) కూడా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసింది.

త‌మ దేశంలో కరోనా కట్టడికి బూస్టర్ డోసు అవసరాన్ని గుర్తించామని అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించామని ఆయ‌న చెప్పారు. అయిన‌ప్ప‌టికీ పేద దేశాల‌కు 500 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ల‌ను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని జో బైడెన్ ప్ర‌క‌టించారు. ఓ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు ధనిక దేశాలు కరోనా వ్యాక్సిన్‌తో పాటు కరోనా వైద్య సాయానికి ముందుకు రావాలని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. వైద్య సదుపాయాల కొర‌త‌తో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న దేశాలకు సాయం అందించాల్సి ఉంద‌ని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబరులోపు ప్రపంచంలోని 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చూడాలని అన్నారు.


Next Story