ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమించిన మహిళను కలవడానికి అక్రమంగా సరిహద్దులు దాటినందుకు పాకిస్థాన్‌లో అరెస్టయ్యాడు. నాగ్లా ఖట్కారీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తిని పాకిస్థాన్ పంజాబ్ పోలీసులు మండి బహౌద్దీన్ నగరంలో అరెస్టు చేశారు.
సోషల్ మీడియాలో ఆ మహిళతో ప్రేమను పెంచుకున్నానని, ఆమెను వ్యక్తిగతంగా కలవాలనే కారణంతో చెల్లుబాటయ్యే వీసా, ప్రయాణ పత్రాలు లేకుండానే దేశంలోకి ప్రవేశించానని బాబు విచారణలో ఒప్పుకున్నట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. ట్రావెల్ డాక్యుమెంటేషన్ లేకపోవడంతో డిసెంబర్ 27న బాబును అరెస్ట్ చేశారు. అతనిపై పాకిస్తాన్ ఫారినర్స్ యాక్ట్, 1946లోని సెక్షన్ 13, 14 కింద కేసు నమోదు చేసి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జనవరి 10, 2025న కోర్టులో మళ్లీ హాజరు కావాల్సి ఉంది.
సదరు వ్యక్తి గతంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దులు దాటేందుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడని ప్రాథమిక విచారణలో తేలింది. తన మూడవ ప్రయత్నంలో అతను విజయవంతంగా పాకిస్తాన్ లోని మండి బహౌద్దీన్‌కు చేరుకున్నాడు. అక్కడ అతను ఆన్‌లైన్‌లో మాట్లాడిన మహిళను కలుసుకున్నాడు. బాబు పాకిస్తాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడం పూర్తిగా అతని ఆన్ లైన్ ప్రేమ కారణంగానే జరిగిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.