రష్యా వైమానిక దాడి.. మంటల్లో 'హ్యారీ పోటర్ కోట'.. ఐదుగురు మృతి
దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో 'హ్యారీ పోటర్ కాజిల్'గా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై రష్యా క్షిపణితో దాడి చేసింది.
By అంజి Published on 1 May 2024 3:00 PM ISTరష్యా వైమానిక దాడి.. మంటల్లో 'హ్యారీ పోటర్ కోట'.. ఐదుగురు మృతి
దక్షిణ ఓడరేవు నగరమైన ఒడెసాలో 'హ్యారీ పోటర్ కాజిల్'గా ప్రసిద్ధి చెందిన ఉక్రెయిన్ భవనంపై సోమవారం రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. న్యూస్ పోర్టల్ ది ఇండిపెండెంట్ యొక్క నివేదిక ప్రకారం.. గోతిక్ శైలిలో నిర్మించిన సుందరమైన భవనం.. స్థానికంగా ఒక ప్రైవేట్ లా ఇనిస్టిట్యూట్‌గా పనిచేస్తోంది. క్షిపణి దాడి తర్వాత హ్యారీ పోటర్ భవనం మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒడెసాపై గడిచిన కొద్ది వారాలలో అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది.
రష్యన్ దళాలు ఒడెసా నగరంపై క్షిపణులు, డ్రోన్లు, బాంబులను ప్రయోగించాయి. ప్రముఖ సముద్రతీర ప్రాంతంలో ఉన్న విద్యా సంస్థను దెబ్బతీశాయి. గర్భిణీ స్త్రీ, నాలుగేళ్ల చిన్నారితో సహా కనీసం 32 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కిపర్ టెలిగ్రామ్‌లో తెలిపారు. ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కిపర్ ప్రకారం.. దాడిలో మరణించిన వారితో పాటు, దాడి కారణంగా స్ట్రోక్‌తో ఓ వ్యక్తి మరణించాడు. ఉక్రేనియన్ నావికాదళ ప్రతినిధి డిమిట్రో ప్లెటెన్‌చుక్, మిలిటరీ టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక పోస్ట్‌లో, క్లస్టర్ వార్‌హెడ్‌తో కూడిన ఇస్కాండర్-ఎమ్ బాలిస్టిక్ క్షిపణిని ఈ దాడిలో ఉపయోగించారని చెప్పారు. ఆ క్షిపణులను అడ్డుకోవడం కష్టం.
తాజా దాడి గురించి రష్యా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఒడెసా మేయర్ హెన్నాడి ట్రుఖానోవ్ మాట్లాడుతూ.. రష్యా సముద్రం ఒడ్డున నడకకు వెళుతున్న వారిని "షూట్ చేసి చంపేస్తోంది" అని అన్నారు. "రాక్షసులు, మృగాలు, క్రూరులు, ఒట్టు.. ఇంకా ఏమి చెప్పాలో నాకు తెలియదు" అని అతను చెప్పాడు. 25 నెలల క్రితం ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఓడరేవు నగరం ఒడెసా తరచుగా రష్యా క్షిపణి, డ్రోన్ దాడులకు లక్ష్యంగా ఉంది .