ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ప్రతినిధి వెల్లడించారు.
రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరాన్ని జెలెస్కీ సందర్శించి తిరిగి వస్తుండగా భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం రాజధాని కీవ్‌లో జెలెన్‌స్కీ, భద్రతా సిబ్బంది వాహనాలను ఓ ప్యాసింజర్ కారు ఢీ కొట్టింది. వెంటనే అధికారులు అధ్యక్షుడితో పాటు ఆయన కారు డ్రైవర్‌ను అంబులెన్స్‌తో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అధ్యక్షుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్రగాయాలు ఏమీ కాలేవని వైద్యులు తెలిపారు.
ఈఘటనపై అధ్యక్ష ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ మాట్లాడుతూ.. "అధ్యక్షుడి కాన్వాయ్ రాజధాని కీవ్ గుండా ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ప్యాసింజర్ కారు జెలెన్‌స్కీ వాహనాన్ని ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్‌తో అక్కడికి చేరుకుని అధికారులు అధ్యక్షుడిని, ఆయన కారు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. అధ్యక్షుడిని వైద్యులు పరీక్షించారు. తీవ్ర గాయాలేవీ కాలేదని నిర్ధారించారని" చెప్పారు.
కాగా.. . ఇది సాధారణ ప్రమాదమా? లేదంటే ఇందులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా? అన్న విషయం తెలుసుకోవాల్సి ఉందన్నారు.