అంగుళం కూడా వదులుకోం.. ర‌ష్యాతో తెగ‌తెంపుల‌కు సిద్ద‌మే : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

Ukraine leader says will consider cutting ties with Russia.ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Feb 2022 3:15 PM GMT
అంగుళం కూడా వదులుకోం.. ర‌ష్యాతో తెగ‌తెంపుల‌కు సిద్ద‌మే : ఉక్రెయిన్ అధ్య‌క్షుడు

ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా దిగ‌జారాయి. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటు వాద ప్రాంతాల‌ను స్వ‌తంత్ర దేశాలుగా గుర్తిస్తూ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌డం అందుకు కార‌ణం. ఆ రెండు స్వ‌తంత్ర దేశాల‌ల్లో శాంతిని ప‌రిర‌క్షించ‌డం అవ‌స‌రం అయితే త‌న సైన్యాన్ని ఆ రెండు దేశాల‌కు పంపిస్తాన‌ని పుతిన్ తెలిపాడు. కాగా.. ఈ నిర్ణ‌యాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. ఆ రెండు ప్రాంతాలతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పింది. అంతేకాకుండా ర‌ష్యాతో ఉన్న అన్ని ర‌కాల సంబంధాల‌ను తెగ‌తెంపులు చేసేసుకుంది ఉక్రెయిన్.

ఈ క్ర‌మంలో నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ 2 వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేసింది. దాని వ‌ల్ల ఎదురైయ్యే ఎలాంటి స‌వాళ్ల‌కైనా సిద్దంగా ఉన్న‌ట్లు ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది. తాజాగా విలేక‌రుల‌తో ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య ఉన్న సంబంధాల‌ను తెంచుకునే అంశాన్ని ప‌రిశీలించాలంటూ త‌మ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఓ విజ్ఞ‌ప్తి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఆ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వెంట‌నే క‌స‌ర‌త్తు ప్రారంభించిన‌ట్లు వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌పై భారీ సైనిక దాడి జరిగే అవ‌కాశం ఉంద‌న్నాడు. అందుకు వేర్పాటు వాద ప్రాంతాల‌కు స్వ‌తంత్ర హోదా క‌ల్పించ‌డ‌మే తొలి అడుగు అన్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌ర్మ‌నీకి గ్యాస్ స‌ర‌ఫ‌రా చేసేందుకు ర‌ష్యా నిర్మించిన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ 2 నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

తాము శాంతిని మాత్ర‌మే కోరుకుంటున్న‌ట్లు దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ వొలొడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఒక్క అంగుళం భూ భాగాన్ని కూడా కోల్పోవ‌డానికి తాము ఎట్టిప‌రిస్థితుల్లో సిద్దంగా లేమ‌ని చెప్పారు. తాము ఎవ్వ‌రికి భ‌య‌ప‌డేది లేద‌ని.. దేశ సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడుకోవ‌డంలో వెన‌క‌డుగు వేసేదే లేద‌న్నారు.

ఇక ఉక్రెయిన్‌, ర‌ష్యా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌పై ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది. ప‌లు దేశాలు ర‌ష్యా తీరుపై మండిప‌డ్డాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలకు అమెరికా, యూకే సిద్ధపడ్డాయి. రష్యాపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. రష్యా వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. ఇక బ్రిట‌న్ ర‌ష్యాకు చెందిన ఐదు బ్యాంకులపై ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ద‌మైంది.

ఇటు భార‌త్‌ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావాలని నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను తరలించే ప్రక్రియను కేంద్రం మొదలు పెట్టింది. మూడు రోజులపాటు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో కేంద్రం తరలించే చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి తొలి విమానం చేరుకోనుందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. చైనా కూడా తమ దేశ ప్రజలను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టింది.

Next Story