యూఏఈలో వ‌ర‌ద‌ల బీభ‌త్సం.. వేలాది మంది పున‌రావాస కేంద్రాల‌కు

UAE hit by worst floods in 27 years.యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ )లో అకాల వర్షాలు భీభ‌త్సాన్ని సృష్టించాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2022 5:25 AM GMT
యూఏఈలో వ‌ర‌ద‌ల బీభ‌త్సం.. వేలాది మంది పున‌రావాస కేంద్రాల‌కు

యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ )లో అకాల వర్షాలు భీభ‌త్సాన్ని సృష్టించాయి. గత 27 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాతి ఎడారి ప్రాంతంగా పేరొందిన పుజైరా తో పాటు పార్జాలోనూ భారీ వ‌ర్షాలు కురిశాయి. వంద‌లాది మంది వ‌ర‌దల్లో చిక్కుకున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం రంగంలోకి దిగి స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 4వేల మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

పుజైరాలో రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 25.5సెం.మీటర్ల వర్షపాతం న‌మోదైంది. గడిచిన 27ఏళ్లలో ఈస్థాయిలో వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పుజైరా సమీపంలోని మసాఫీ గ్రామంలో 20.9 సెం.మీ, ఫుజైరా విమానాశ్రయం సమీపంలో 18.7 సెం.మీ వర్షపాతం కురిసింది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌ర్వ‌త దిగువ‌న ఉన్న గ్రామాలు మొత్తం నీట మునిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ద‌ల‌ కారణంగా ఏడుగురు ఆసియా ప్రవాసులు మృతి చెందినట్టు యూఏఈ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇక ఎడారి దేశంలో అరుద‌గా చోటుచేసుకున్న వ‌ర‌ద‌ల‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story