అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పుల కలకలం చెలరేగింది. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో ఆయన గోల్ఫ్ ఆడుతుండగా కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించింది. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు నెలల కిందట సభలో ప్రసంగిస్తుండగా ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. డోనాల్డ్ ట్రంప్‌నకు సమీపంలో కాల్పులు జరగడంపై ఆయన కుమారుడు ట్రంప్ జూనియర్ స్పందించారు.
ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో ఉన్న ట్రంప్ గోల్ఫ్ కోర్స్‌లో మళ్లీ కాల్పులు జరిగాయని చెప్పారు. చెట్ల మధ్య ఏకే 47ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని ట్వీట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరగడాన్ని వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఖండించారు. ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. అమెరికాలో హింసకు తావు లేదని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది.