ముగింపు దశకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ట్రంప్ కీలక ప్రకటన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది

By -  Knakam Karthik
Published on : 29 Dec 2025 9:38 AM IST

International News, Donald Trump, Ukraine war, Russia Ukraine conflict, Volodymyr Zelensky, Vladimir Putin, Peace talks

ముగింపు దశకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ట్రంప్ కీలక ప్రకటన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్– రష్యా శాంతి ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ భీకర యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత భయంకరమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. దీనికి ముగింపు పలకడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో క్లబ్‌లో శాంతి ఒప్పందంపై చర్చించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశం తర్వాత ఇరువురు దేశాధినేతలు మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ట్రంప్ శాంతి ఒప్పందంపై కీలక కామెంట్స్ చేశారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని పేర్కొన్నారు. జెలెన్‌స్కీతో సమావేశానికి ముందే తాను పుతిన్ తో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే, యూరోపియన్ నేతలతో కూడా తాను మాట్లాడినట్లు తెలిపారు. శాంతి చర్చలు మునుపెన్నడూ లేనంతగా పురోగమించాయని, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

90శాతం అంశాలపై ఏకాభిప్రాయం: జెలెన్‌స్కీ

శాంతి చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ ప్రతిపాదించిన 20 పాయింట్ల ప్రణాళికపై ప్రధానంగా దృష్టి సారించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. శాంతి ప్రణాళికలోని 90 శాతం అంశాలపై ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. అమెరికా-ఉక్రెయిన్ మధ్య రక్షణ పరమైన హామీలపై 100 శాతం స్పష్టత వచ్చిందన్నారు. ఐరోపా దేశాలు కూడా ఇందులో భాగస్వాములు కానున్నట్లు తెలిపారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం స్థాయి, ఆయుధ సంపత్తిపై పూర్తి స్థాయి అంగీకారం లభించినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేసే ప్లాన్ తుది దశకు చేరుకుందని జెలెన్‌స్కీ వెల్లడించారు.

అయితే, ఈ చర్చలపై రష్యా మాత్రం భిన్నంగా స్పందించింది. డాన్‌బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వెంటనే వైదొలగాలని డిమాండ్ చేసింది. శాంతికి యూరప్ దేశాలే అడ్డంకిగా ఉన్నాయని ఆరోపించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారం కాకపోతే, సైనిక చర్య ద్వారానే ముందుకు వెళ‌తామ‌ని పుతిన్ ఇటీవల హెచ్చరించారు. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య చర్చలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, రష్యా కఠిన వైఖరి కారణంగా శాంతి ఒప్పందం ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందనేది రాబోయే కొద్ది వారాల్లో తేలిపోనుంది.

Next Story