అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వెనక్కి పంపేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. బలవంతపు బహిష్కరణల కంటే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి ప్రాధాన్యతనిస్తూ, వారికి 2,600 డాలర్ల (సుమారు రూ. 2.40 లక్షలు) భారీ ‘ఎగ్జిట్ బోనస్’ ప్రకటించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు వారి స్వదేశాలకు వెళ్లే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.
ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకునే వారు 'సీబీపీ హోమ్' అనే ప్రత్యేక యాప్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలా చేసిన వారిని బలవంతపు బహిష్కరణ జాబితా నుంచి తొలగిస్తారు. ఒక్కో వలసదారుడిని అరెస్ట్ చేసి పంపడానికి సుమారు 18,245 డాలర్లు ఖర్చవుతుండగా, ఈ స్వచ్ఛంద పద్ధతిలో కేవలం 5,100 డాలర్లతోనే పని పూర్తవుతుందని, దీనివల్ల అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ము భారీగా ఆదా అవుతుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది.
అయితే ఈ అవకాశాన్ని వాడుకోని వారిపై కఠిన చర్యలు ఉంటాయని, గౌరవంగా వెళ్లకపోతే అరెస్ట్ చేసి పంపుతామని, అప్పుడు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉండదని సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోమ్ హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో ఉన్న 1,000 డాలర్ల బోనస్‌ను 2,600 డాలర్లకు పెంచగా, ఇప్పటివరకు ఈ విధానం ద్వారా దాదాపు 22 లక్షల మంది అమెరికాను వీడటం గమనార్హం.