తెలియని ప్రదేశాలకు వెళ్లే సమయాల్లో జీపీఎస్ ను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు కొందరు. చాలా వరకూ జీపీఎస్ ఎంతగానో సహాయం చేస్తుంది. కానీ కొన్ని కొన్ని సార్లు గుడ్డిగా నమ్మేయడం కూడా మనకు సమస్యలను తెచ్చిపెడుతుంది. తాజాగా జీపీఎస్ డైరెక్షన్స్ ను నమ్మిన వాళ్లు ఏకంగా కారుతో సముద్రంలోకి దూసుకుని వెళ్లిపోయారు.
హవాయిలోని కైలువా-కోనాలోని ఓడరేవులోకి GPS సూచనలను అనుసరించి కారుతో సహా నీటిలోకి వెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా ఇద్దరు పర్యాటకులను అందరూ కలిసి రక్షించాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. కారుతో సహా ఇద్దరు మహిళలు మునిగిపోతూ ఉండగా.. అక్కడే ఉన్న వ్యక్తులు నీటిలోకి దూకి కాపాడాల్సి వచ్చింది. ఇద్దరు మహిళలు కారు ముందు కిటికీల నుండి బయటకు వచ్చేయడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కారులో ఉన్న వాళ్లు అక్కాచెల్లెళ్లు అని తెలుస్తోంది. హార్బర్‌లో మాంటా రే స్నార్కెల్ టూర్ కంపెనీని వెతుకుతున్నప్పుడు వారు GPS సూచనలను అనుసరిస్తూ వచ్చారని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.