విమానం టేకాఫ్ అవుతుండ‌గా అగ్నిప్ర‌మాదం.. మొత్తం 122 మంది

Tibet Airlines' plane in China veers off runway.చైనా దేశంలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 4:56 AM GMT
విమానం టేకాఫ్ అవుతుండ‌గా అగ్నిప్ర‌మాదం.. మొత్తం 122 మంది

చైనా దేశంలోని చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్ర‌మాదం త‌ప్పింది. టేకాఫ్ అవుతున్న విమానంలో ఆక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది విమానాన్ని నిలిపి వేయ‌డంతో పాటు ప్ర‌యాణీకుల‌ను అత్య‌వ‌స‌ర ద్వారాల గుండా విమానం నుంచి బ‌య‌ట‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌లో 25 మంది గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చాంగ్‌కింగ్ విమానాశ్ర‌యం నుంచి నింగ్చి కి వెళ్లాల్సి ఉంది. ప్ర‌యాణీకులు అంద‌రూ విమానంలో కూర్చోని ఉన్నారు. స‌రిగ్గా గురువారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో విమానం టేకాఫ్ అయ్యేందుకు ర‌న్‌వేపై బ‌య‌లుదేరింది. అయితే.. ఒక్క‌సారిగా విమానం దిశ‌ను మార్చుకుని ర‌న్‌వే ప‌క్క‌కు వెళ్లిపోయింది.

అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది విమానాన్ని వెంట‌నే నిలిపివేశారు. అప్ప‌టికే విమానం రెక్క వ‌ద్ద పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌యాణీకుల హాహాకారాల‌తో ఆ ప్రాంతం దద్ద‌రిల్లిపోయింది. అయితే.. విమాన సిబ్బంది.. వెనుక‌వైపు ఉన్న అత్య‌వ‌స‌ర ద్వారం గుండా ప్రయాణీకుల‌ను కింద‌కు దించారు. ఈ ఘ‌ట‌న‌లో 25 మంది గాయ‌ప‌డ్డారు. వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఆ విమానంలో 113 ప్ర‌యాణీకులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ర‌న్‌వే పై ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో కొన్ని విమానాల‌ను దారి మ‌ళ్లించారు. కాగా.. ఈ విమాన ప్ర‌మాదంపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.

Next Story